Bangles : మహిళలు గాజులను ధరించడం ఎప్పుడో పురాతన కాలం నుంచే సాంప్రదాయంగా వస్తోంది. గాజులను మహిళలు వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావిస్తారు. పెళ్లి కాని వారైతే అందం, ఆకర్షణ కోసం ధరిస్తారు. అయితే కేవలం ఇవే కాదు, గాజులను ధరించడం వెనుక మనకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. భారతీయ ఆచార వ్యవహారాలు, నమ్మకాల ప్రకారం బంగారు, వెండి ఆభరణాలు మహిళలకు శక్తినిస్తాయి. చేతులపై బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలకు దృఢత్వం చేకూరుతుంది. అంతేకాదు ఇవి నిరంతరం దేహానికి తగులుతూ ఉండడం వల్ల వాటిలోని సూక్ష్మ పదార్థాలు, అణువులు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఇలాంటి బంగారు, వెండి అణువులు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
గాజులను ధరిస్తే మహిళలు, వారి భర్తలు ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని మతాల్లో నమ్ముతారు. గాజులు లేకపోతే అలంకరణ అసంపూర్తిగా ఉన్నట్టేనని హిందువుల్లో అధిక శాతం మంది నమ్ముతారు. మహిళలు గాజులను ఎల్లప్పుడూ ధరించి ఉండడం వల్ల వాటి ద్వారా వచ్చే శబ్దాలు ఇండ్లలో ఉండే దుష్ట శక్తులను తరుముతాయని హిందూ సాంప్రదాయంలో నమ్ముతారు. అంతేకాదు గాజుల శబ్దాలు ఎక్కువగా ఉంటే ఆ నివాసం దైవానికి నెలవని నమ్ముతారు.
పురాతన కాలంలో మహిళలు పరపురుషులను చూడాల్సి వస్తే వారి ముఖాలను చేతులు లేదా వస్త్రంతో కప్పుకునేవారు. దీనికి అనుగుణంగానే ఇతర పురుషులు మహిళలకు గౌరవం ఇచ్చేవారు. అదే సమయంలో మహిళ కనిపించకుండా గాజుల శబ్దమైనా కూడా పురుషులు అప్రమత్తమై వారికి కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది గాజులను ధరించడం లేదు. కానీ గాజులను ధరించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఆయుర్వేద పరంగా కూడా మనకు లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. గాజులు వెండి, బంగారు వంటివే కాకుండా.. మట్టి గాజులను కూడా ధరించవచ్చని అంటున్నారు.