ఆహారమే ఔషధమని పెద్దలు చెప్పారు. సరైన ఆహారాన్ని సరైన రీతిలో తీసుకుంటే మనకు ఉండే వ్యాధులను తరిమికొట్టవచ్చు. అందుకు గాను ఎలాంటి మెడిసిన్లను వాడాల్సిన పనిలేదని దాని అర్థం. అందుకనే ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలని అతిగా తినకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇక ఎన్నో వ్యాధులకు ఎన్నో రకాల ఆహారాలు ఔషధాలుగా పనిచేస్తాయి. వాటిని సక్రమంగా తీసుకుంటే ఆయా వ్యాధులను తరిమికొట్టవచ్చు. ఇక అలాంటి ఆహారాల్లో శనగలు కూడా ఒకటి.
శనగలు మనకు రెండు రకాలుగా లభిస్తాయి. కాబూలీ శనగలు, సాధారణ నల్ల శనగలు. అయితే నల్ల శనగలను గనక రోజూ ఉడకబెట్టి ఒక కప్పు తింటే రక్తం పుష్కలంగా తయారవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రక్తం తయారయ్యేందుకు అత్యంత సులభమైన, ధర తక్కువ అయిన పద్ధతి ఇదని వారు అంటున్నారు.
నల్ల శనగల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాకపోతే వీటిని పొట్టుతో సహా అలాగే ఉడకబెట్టి తినాలి. అందుకనే మన పెద్దలు నల్ల శనగలతో గుడాలు తయారు చేసుకుని తింటారు. వీటినే గుగ్గిళ్లు అంటారు. గుగ్గిళ్లు మన శరీరానికి చాలా బలం. ఇవి రక్తాన్ని పెంచుతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. కనుక రోజూ ఒక కప్పు వీటిని తినాలని, దీంతో రక్తం పెరుగుతుందని, రక్తహీనత తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి వీటిని రోజూ మరిచిపోకుండా తినండి. ఆరోగ్యంగా ఉండండి.