White Rice : ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ అనేది వంశ పారంపర్యంగా, ఇతర కారణాల వల్ల వస్తే.. టైప్ 2 డయాబెటిస్ అనేది కేవలం అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లనే వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, అతి తిండి, అతి నిద్ర లేదా నిద్ర లేకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం, శారీర శ్రమ చేయకపోవడం వంటివి టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే ఒక సందేహం వస్తుంటుంది. అదేమిటంటే.. అన్నం తినవచ్చా.. తినకూడదా.. అని వారు సందేహిస్తుంటారు. అయితే ఇందుకు సైంటిస్టులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపుగా 20 శాతం మంది ప్రజలు అన్నాన్నే ఆహారంగా తింటున్నారు. అయితే డైటిషియన్లు చెబుతున్న ప్రకారం బియ్యంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు అన్నం తినడం వల్ల మనకు సుమారుగా 200 నుంచి 240 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే 45 నుంచి 50 గ్రాముల మేర కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. అయితే మనకు శక్తి పరంగా చూస్తే క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు రెండూ అవసరమే. కనుక అన్నం తినాల్సిందేనని చాలా మంది భావిస్తుంటారు.
అన్నం తినొచ్చా..?
అయితే ప్రస్తుతం వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం షుగర్ పేషెంట్లు అన్నాన్ని తక్కువగా తీసుకోవాలి. అంటే కార్బొహైడ్రేట్లను తక్కువగా తినాలన్నమాట. అలాగే ఫైబర్ ఎక్కువగా, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అప్పుడే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం రోజూ డయాబెటిస్ పేషెంట్లు అన్నంకు బదులుగా ఆహారంలో తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలను కనుక తింటుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని తేల్చారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలను డయాబెటిస్ కేర్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
2021లో కొందరు సైంటిస్టులు చేపట్టిన మరో పరిశోధన ప్రకారం తెల్ల అన్నంకు బదులుగా బ్రౌన్ రైస్‌ను తిన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిలు పెరిగాయని, అలాగే బ్రౌన్ రైస్‌ను తిన్నవారు బరువు తగ్గారని కూడా తేల్చారు. అయితే అన్నం తినడం వల్లే టైప్ 2 డయాబెటిస్ వస్తుందని ఇప్పటి వరకు ఏ సైంటిస్టూ చెప్పలేదు. కానీ అన్నంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కనుక అన్నాన్ని తింటే షుగర్ పెరుగుతుందని నమ్ముతున్నారు. కానీ శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు. అయితే రిస్క్ ఉంటుందన్నది మాత్రం నిజం అని సైంటిస్టులు చెబుతున్నారు.
బ్రౌన్ రైస్ ఎంతో మేలు..
అయితే అధ్యయనాలు, డైటిషియన్లు చెబుతున్న ప్రకారం అసలు వైట్ రైస్‌ను తినాలా, వద్దా.. అన్న విషయానికి వస్తే.. దానికి బదులుగా బ్రౌన్ రైస్ తినడం ఉత్తమం అని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో బరువు తగ్గుతారు. పైగా షుగర్ లెవల్స్ కూడా అదుపులోకి వస్తాయి. కనుక షుగర్ పేషెంట్లకు బ్రౌన్ రైస్ దివ్య ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇక బ్రౌన్‌రైస్‌తోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలను తరచూ తినాలని సూచిస్తున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్ తగ్గడమే కాకుండా, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని అంటున్నారు. కనుక షుగర్ ఉన్నవారు అన్నంకు బదులుగా బ్రౌన్ రైస్‌ను తింటే మంచిది. దీంతో ఓ వైపు షుగర్ లెవల్స్‌ను తగ్గించుకుంటూనే మరోవైపు అధిక బరువు కూడా తగ్గవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.