Chicken Mutton Fish : ప్రస్తుత తరుణంలో చాలా మంది చికెన్, మటన్, చేపలు తదితర మాంసాహారాలను అధికంగా తింటున్నారు. కరోనా కారణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గతంలో వారంలో ఒకసారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొందరు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తినడం వల్ల మనకు ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. దీంతో కరోనా వంటి వైరస్‌లతోపాటు బాక్టీరియాలను సైతం ఎదిరించే శక్తి మన శరీరానికి లభిస్తుంది. కనుకనే మాంసాహారం తింటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే మనకు అనేక రకాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నా.. వాటిల్లో చాలా మంది ప్రధానంగా తినేవి.. చికెన్, మటన్, చేపలు అని చెప్పవచ్చు. ఇక వీటిల్లో దేంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. దేన్ని తినడం వల్ల మనకు ఎక్కువగా లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మూడింటిలో దేని వల్ల మనకు ఎక్కువ ఫలితం ఉంటుందో తెలుసుకోవాలంటే.. ముందుగా వీటిల్లో పోషకాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఇక వీటిలో ఉండే పోషకాల విషయానికి వస్తే..
100 గ్రాముల చికెన్ ద్వారా మనకు 165 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే 31 గ్రాముల ప్రోటీన్లు, 3.6 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. దీంతోపాటు చికెన్ లో కొలెస్ట్రాల్, సోడియం, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, మెగ్నిషియం, కాల్షియం, విటమిన్ బి12 వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
ఇక 100 గ్రాముల మటన్ ద్వారా మనకు 294 క్యాలరీల శక్తి లభిస్తుంది. దీంతోపాటు 25 గ్రాముల ప్రోటీన్లు, 9 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్, సోడియం, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, మెగ్నిషియం, కాల్షియం, విటమిన్ బి12 తదితర పోషకాలు కూడా మటన్‌లో దండిగా ఉంటాయి.
అలాగే 100 గ్రాముల చేపల ద్వారా మనకు 206 క్యాలరీల శక్తి లభిస్తుంది. 22 గ్రాముల ప్రోటీన్లు, 12 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్, సోడియం, పొటాషియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నిషియం, కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు కూడా చేపల్లో అధికంగా ఉంటాయి.
అయితే ఈ మూడింటిలోనూ మనకు దేని వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి ? అంటే.. మూడింటి వల్ల కూడా మేలే జరుగుతుంది. కానీ ప్రోటీన్ల విషయానికి వస్తే.. అవి అధికంగా కావాలనుకునేవారు చికెన్‌ను తినాలి. ఎందుకంటే మటన్, చేపల కన్నా చికెన్‌లోనే ప్రోటీన్లు ఎక్కువ. ఇక ప్రోటీన్లు వద్దు.. ఇతర పోషకాలు కావాలి అనుకుంటే.. మటన్, చేపలను తినాలి. ఎందుకంటే వీటిల్లో ప్రోటీన్ల కన్నా ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎవరైనా సరే.. ఈ మూడింటినీ తినవచ్చు. కానీ తమకు అవసరం అయిన పోషకాలను బట్టి వీటిని తింటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. అలా వీటిని తినాలి.
ఇక అధిక బరువు ఉన్నవారు, షుగర్, కొలెస్ట్రాల్, బీపీ ఉన్నవారు చికెన్, చేపలు తింటే మేలు జరుగుతుంది. అలాగే పోషకాహార లోపం ఉన్నవారు మటన్, చేపలను తినాలి. అధిక బరువు పెరగాలనుకుంటే మటన్‌ను తినాలి. ఇలా అవసరానికి తగినట్లు ఈ మూడు మాంసాహారాలను తింటుంటే ఎక్కువ మేలు పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.