Coconut Cream : మనం స్మూతీస్, కుక్కీస్, కేక్స్, డిసర్ట్స్, షేక్స్ అలాగే కొన్ని రకాల వంటల తయారీలో క్రీమ్స్ ను ఉపయోగిస్తూ ఉంటాం. వివిధ రుచుల్లో క్రీమ్స్ మనకు లభిస్తాయి. క్రీమ్స్ ను వాడడం వల్ల మనం చేసే వంటల రుచి మరింత పెరుగుతుంది. అయితే ఈ క్రీమ్స్ ను ఎక్కువగా వాడడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ట్రై గ్లిజరాయిడ్ల శాతం కూడా పెరుగుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. పాల నుండి తయారు చేసే బటర్, క్రీములకు బదులుగా కొకోనట్ క్రీమ్ ను వాడితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొకోనట్ క్రీమ్ ను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని సేకరించి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని గట్టిగా పిండితే దాని నుండి కొబ్బరి పాలు వస్తాయి. ఈ పాలను నాలుగు నుండి ఐదు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల కొబ్బరి పాలపై మందంగా, చిక్కగా తేటలాగా ఏర్పడుతుంది. ఇదే కొబ్బరి క్రీమ్. ఈ కొబ్బరి పాలను ఫ్రిజ్ నుండి బయటకు తీసి నెమ్మదిగా వాటి నుండి క్రీమ్ ను వేరు చేయాలి. ఈ క్రీమ్ ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవచ్చు. పాల నుండి తయారు చేసిన క్రీమ్ కు బదులుగా ఈ కొకోనట్ క్రీమ్ ను మనం వాడుకోవచ్చు.
ఐస్ క్రీమ్స్, స్మూతీస్, షేక్స్, డిసర్ట్స్ తో పాటు వంటల్లో కూడా మనం ఈ కొకోనట్ క్రీమ్ ను వాడవచ్చు. బటర్ కు బదులుగా కూడా ఈ కొకోనట్ క్రీమ్ ను మనం ఉపయోగించుకోవచ్చు. ఈ క్రీమ్ లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. దీనిని వాడడం వల్ల మెదడుకు ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరి తెలివితేటలకు, మేధాశక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీనిని వాడడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బటర్ కు, మిల్క్ క్రీమ్ కు ప్రత్యామ్నాయంగా ఈ కొకోనట్ క్రీమ్ ను వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.