Cumin Health Benefits : మన వంటగదిలో ఉండే పోపు దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దాదాపు మనం చేసే ప్రతి వంటలోనూ జీలకర్రను వేస్తూ ఉంటాము. వంటలకు చక్కటి వాసనను, రుచిని తీసుకు రావడంలో జీలకర్ర ఎంతో దోహదపడుతుంది. అలాగే జీలకర్ర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీలకర్రను వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంటి వైద్యాలకు జీలకర్ర చక్కగా పని చేస్తుంది. జీలకర్రను వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్రను నోట్లో వేసుకుని బాగా నమిలి రసాన్ని మింగడం వల్ల కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు రావడం, వికారం వంటి సమస్యలు తగ్గుతుంది.
జీలకర్రను నమిలి మింగడం వల్ల కడుపులో నులిపురుగులు నశిస్తాయి. డయోరియాతో బాధపడే వారు నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి భోజనం తరువాత రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల డయేరియా తగ్గుముఖం పడుతుంది. షుగర్, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారు జీలకర్రతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీలకర్ర కషాయాన్ని తీసుకోవడం వల్ల ఎలర్జీ సమస్య తగ్గుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గించడంలో కూడా జీలకర్ర మనకు సహాయపడుతుంది. జీలకర్రను వేయించి బాగా పండిన అరటిపండుతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అలాగే జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు జీలకర్రను తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. నీటిలో అల్లం వేసి బాగా మరింగించాలి.
తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గొంతునొప్పి, జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నీటిలో జీలకర్ర పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి వేసి చిన్న మంటపై మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని వడకట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరం బరువు తగ్గుతుంది. అదే విధంగా కడుపులో అల్సర్, పుండ్లు వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఉదయం పరగడుపున ఒక టీ స్పూన్ నెయ్యిలో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి తీసుకోవడం వల్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది. అదే విధంగా చెమట పొక్కులతో బాధపడే వారు నిమ్మరసంలో జీలకర్ర పొడి కలిపి వాటిపై రాయాలి.
ఇలా చేయడం వల్ల చెమట పొక్కులు తగ్గుతాయి. అలాగే కొబ్బరి నూనెలో జీలకర్ర పొడి వేసి గోరు వెచ్చగా అయ్యే వరకు వేడి చేయాలి. తరువాత ఈ నూనెను తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు ధృడంగా తయారవుతాయి. కళ్లల్లో వేడి తగ్గుతుంది. అలాగే తలలో దురద, ఇన్పెక్షన్ లతో బాధపడే వారు ఆవు పాలల్లో మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో దురద, ఇన్పెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి.