Cumin Water : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయి. మారిన ఈ ఆహారపు అలవాట్ల కారణంగా అనేక జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. గ్యాస్, అజీర్తి, మలబద్దకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణసంబంధిత సమస్యల బారిన పడే వారు రోజుకు రోజుకు ఎక్కువవుతున్నారు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి దానిలో ఉండే పోషకాలను శరీరానికి అందించడంలో జీర్ణాశయం, ప్రేగులు కీలక పాత్ర పోషిస్తాయి. దీని వల్ల జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. అందుకే చక్కటి భోజనం చేయడంతో పాటు మన పొట్టను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం.
పొట్ట ఎప్పటికప్పుడు శుభ్రం కాకపోవడం వల్ల మలబద్దకం సమస్య మరింత పెరుగుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలోని అవశేషాలు ప్రేగుల్లోనే ఉండిపోతాయి. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు పూర్తిగా శుభ్రపడకపోవడం వల్ల రోజంతా అలసటగా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపు శుభ్రపడకపోవడం వల్ల ఆకలి వేయదు. సరిగ్గా నిద్రపట్టదు. దీని ప్రభావం కొద్ది కొద్దిగా మన చర్మంపై, వెంట్రుకలపై కూడా పడుతుంది. పైల్స్, కడుపులో అల్సర్, కాలేయం ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం మన జీర్ణ వ్యవస్థన్నంతటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మన పొట్ట మొత్తం శుభ్రపడుతుంది.
దీంతో ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. పొట్టను శుభ్రపరిచే ఈ సహజ సిద్ద పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిలో 5 లేదా 6 చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. తరువాత ఈ నీటిలో రుచికి తగినట్టు బ్లాక్ సాల్ట్ ను లేదా ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ జీలకర్రతో చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి.
రక్తం శుభ్రపడుతుంది. ఈ టీ ని తాగడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యి ఉదయం పూట సుఖ విరోచనం అవుతుంది. మలబద్దకం ససమ్య తగ్గుతుంది. ప్రేగుల్లో ఎటువంటి వ్యర్థాలు లేకుండా కడుపు మొత్తం ఖాళీ అవుతుంది. ఈ జీలకర్ర పానీయాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా ప్రతిరోజూ జీలకర్రతో ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడడంతో పాటు మన ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.