Curry Leaves Water : కరివేపాకులను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. కరివేపాకులను వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వంటల్లో మనం ఆ ఆకులను వేస్తాం.. కానీ అన్నంలో కూర కలిపి తినేటప్పుడు అవి వస్తే మాత్రం పక్కన పెట్టేస్తాం. కానీ కరివేపాకులు ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందినవని ఆయుర్వేదం చెబుతోంది. కనుక కూరల్లో వచ్చే కరివేపాకులను పక్కన పెట్టకుండా తినాలి. దీంతో అనేక లాభాలు పొందవచ్చు. అయితే అలా కాకుండా వీటిని మీరు ఉదయం పరగడుపునే కూడా తినవచ్చు. దీంతో రోజంతా కూరల్లో వీటిని తినాల్సిన అవసరం లేదు.
ఇక కరివేపాకులను నేరుగా తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కనుక అలాంటి వారు కరివేపాకులతో నీటిని తయారు చేసి తాగవచ్చు. ఆ నీళ్లను తాగినా కూడా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఆ నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కరివేపాకు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో కొన్ని నీటిని పోసి మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించాక స్టవ్ ఆఫ్ చేయాలి. నీటిని చల్లార్చాలి. గోరు వెచ్చగా అవగానే వడకట్టి తాగేయాలి. ఇందులో రుచి కోసం అవసరం అనుకుంటే తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవచ్చు.
శరీర మెటబాలిజం పెరుగుతుంది..
ఇక ఇలా తయారు చేసుకున్న కరివేపాకు నీళ్లను తాగడం వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్స్ చెబుతున్న ప్రకారం కరివేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మన శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
కరివేపాకు నీళ్లను తాగడం వల్ల మీ జుట్టుకు అది మంచి టానిక్‌లా పనిచేస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. తెల్లగా మారిన జుట్టు నల్లగా అవుతుంది. జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. కరివేపాకు నీళ్లను తాగడం వల్ల వాటిల్లో ఉండే జీర్ణాశయ ఎంజైమ్‌లు సుఖ విరేచనం అయ్యేలా చేస్తాయి. ఈ నీళ్లు సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకం సమస్య ఉన్నవారికి ఈ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో మలబద్దకం సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు గాను ఈ నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాల్సి ఉంటుంది.
మైండ్ రిలాక్స్ అవుతుంది..
కరివేపాకు అద్భుతమైన వాసనను ఇస్తుంది. ఇది మన శరీరంపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల కరివేపాకు నీళ్లను రోజూ పరగడుపునే తాగితే కండరాలు రిలాక్స్ అవుతాయి. మైండ్ ప్రశాంతంగా మారుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కూల్‌గా వర్క్ చేస్తారు. ఇలా కరివేపాకు నీళ్లను తాగడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ నీళ్లను తాగితే కొందరిలో అలర్జీలు రావడం, విరేచనాలు అవడం వంటి సమస్యలు కలగవచ్చు. అలా జరిగితే వెంటనే ఈ నీళ్లను తాగడం మానేయాలి. ఇక కరివేపాకులతో నీళ్లను ఇలా తయారు చేసి రోజూ తాగడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.