చాక్లెట్ ను ఇప్పటికే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక ఇపుడు చాక్లెట్లు తినేవారికి మరింత శుభవార్తగా డార్క్ చాక్లెట్ డైలీ తింటే గుండె జబ్బులు కూడా దూరమవుతున్నాయంటున్నారు ఒక ఫుడ్ సైంటిస్ట్. ఒక్కటి తింటే చాలు ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనపడుతుందని చెపుతున్నారు ప్రొఫెసర్ రోజర్ కార్డర్. గతంలో చేసిన చాక్లెట్లు గుండెజబ్బుల అధ్యయనాన్ని మరోమారు సమీక్షించిన ప్రొఫెసర్ కార్డర్ ఖచ్చితమైన డోస్ అంటే ఒక ఔన్సు లేదా 25 గ్రాములు అంటే షుమారు రెండు లేదా మూడు బిళ్ళల చాక్లెట్ చాలని చెపుతున్నారు.
అయితే, కొన్ని చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు ప్రధానంగా అధికంగా వుంటాయని వాటికంటే కూడా నల్లని చాక్లెట్లలో వుండే కోకో ఫ్లేవనాయిడ్లు రక్తం మరియు సరఫరా వ్యవస్ధపైనా మంచి ప్రభావం చూపుతున్నాయని, ఇవి ప్రమాదకారి అయిన రక్తంలోని గడ్డలను తొలగించి రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయని, శరీరంలో బ్లడ్ సరఫరాను బాగు పరుస్తాయని ప్రొఫెసర్ కార్డర్ వెల్లడించారు. ఫ్లేవనాయిడ్లు చాక్లెట్ తయారీలో ప్రతి బ్యాచ్ కు మారుతూంటాయి కనుక తయారీ దారులు వాటి వివరాల లేబుల్స్ చాక్లెట్ పై వేయాలని ఆయన సూచించారు.
మంచి చాక్లెట్ అంటే అందులో 70 శాతం కోకో వుండాలని అందులో అధిక స్ధాయి ఫ్లేవనాయిడ్లు వుండగలవన్నారు. సెంట్రల్ అమెరికాలోని గిరిజనులపై చేసిన ప్రయోగాల్లో వారు తినే ఆహారంలో కోకో అధికంగా వుందని, ఇది రక్త కణాలు సాగేటందుకు తోడ్పడి రక్తపోటు, రక్తం గడ్డ కట్టడం, గుండె పోటు, ఇతర గుండె జబ్బులు లేకుండా చేస్తోందని ఆయన తెలిపారు. చాక్లెట్ ను సంతులిత ఆహారంలో ఒక భాగంగా చేయాలని అన్నారు. అమెరికాలో చేసిన మరో స్టడీ కూడా డార్క్ చాక్లెట్లు వయసు సంబంధిత కంటి జబ్బులను కూడా తగ్గించగలదని వెల్లడించింది.