Onion For Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టు దువ్వినప్పుడు, అలాగే తలస్నానం చేసినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో అయితే జుట్టు కుచ్చులు కుచ్చలుగా ఊడి మరీ వస్తూ ఉంటుంది. జుట్టు రాలడంతో పాటు జుట్టు పల్చబడడం, జుట్టు విరిగిపోవడం, చిట్లడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన, రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడం, వాతావరణ కాలుష్యం, జుట్టుపై తగిన శ్రద్ద చూపించకపోవడం, అలాగే శరీరంలో ఉండే వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.
అయితే చాలా మంది జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపులను, హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడినప్పటికి ఫలితం లేక ఇబ్బంది పడే వారు చాలా మందే ఉండి ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే ఉల్లిపాయతోనే మనం మన జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. ఉల్లిపాయ మన జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయలో సల్ఫర్, అమ్మోనియా వంటివి ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయలో ఉండే జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కెరాటిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. దీంతో జుట్టు పెరుగుదల వేగంగా ఉండడంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
అలాగే ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు చర్మం కింద ఉండే కొలాజెన్ ను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. దీంతో జుట్టు కుదుళ్లను బలంగా, కదలకుండా ఉంటాయి. దీంతో జుట్టు ఎక్కువగా రాలకుండా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలో కాఫిరాల్, కొర్ సటిన్ అనే రెండు రసాయనాలు ఉంటాయి. ఇవి రెండు కూడా జుట్టు కుదుళ్లకు రక్తాన్ని అందించే రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు రాలడానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో కూడా ఉల్లిపాయ మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా జుట్టు ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఈ మిశ్రమాన్ని ఆరిపోయే వరకు అలాగే ఉంచి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు చక్కగా అందుతాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.