Snoring : ప్రస్తుత తరుణంలో చాలా మంది గురక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక బరువు, హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉండేవారితోపాటు చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నవారు, నాలుక మందంగా ఉన్నవారికి గురక అధికంగా వస్తుంది. అయితే గురక వచ్చే అందరూ ఈ సమస్య నుంచి బయట పడాల్సి ఉంటుంది. లేదంటే గురక అధికమై నిద్రలోనే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును.. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహరి ఈ సమస్యతోనే కన్నుమూశారు. కనుక గురక సమస్య ఉన్నవారు జాగ్రత్త పడాల్సిందే.
గురక సమస్య అధికంగా ఉంటే దాన్ని Obstructive Sleep Apnea (అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) అంటారు. ఈ సమస్య ఉంటే నిద్రలో బీపీ పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. శ్వాస సరిగ్గా ఆడదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. దీంతో నిద్రలోనే ప్రాణాలను కోల్పోతారు. అందువల్ల గురక సమస్య ఉన్నవారు అస్సలు లైట్ తీసుకోరాదు. అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ప్రస్తుతం గురక సమస్యకు మనకు అందుబాటులో అనేక ఆధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి. సరైన వైద్య నిపుణులను సంప్రదించి గురక సమస్యకు ముందుగా పరీక్షలు చేయించుకోవాలి. దీంతో సమస్యను తగ్గించుకునేందుకు వారు వివిధ రకాల చికిత్సలను అందిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. దీంతో గురక సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక కింద తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. గురక సమస్య ఉండే వారు ఏదైనా ఒక వైపుకు నిద్రించాలి. వెల్లకిలా పడుకుంటే సమస్య అధికమవుతుంది. కనుక ఏదైనా ఒక వైపుకు నిద్రించాల్సి ఉంటుంది. అలాగే రోజూ తగినంత నిద్ర పోవాలి. బరువు అధికంగా ఉంటే తగ్గించుకోవాలి. షుగర్ ఉంటే నియంత్రణలో ఉండాలి. బీపీని కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇలా చేస్తే చాలా వరకు గురక సమస్య తగ్గుతుంది.
2. రాత్రి మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. నిద్రించే దిండు కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
3. ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క వేసి మరిగించి ఆ నీటిలో కొద్దిగా తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో గురక సమస్య తగ్గుతుంది.
4. రాత్రి నిద్రకు ముందు నువ్వులు లేదా ఆవనూనె లేదా కొబ్బరినూనె కొద్దిగా వేడి చేసి ఒక్కో చుక్క చొప్పున రెండు ముక్కు రంధ్రాల్లో వేయాలి. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. గురక రాకుండా ఉంటుంది.
5. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలి. లేదా రాత్రి భోజనంలో రెండు ఉల్లిపాయ ముక్కలను తినాలి. ఇవి శ్వాస సరిగ్గా ఆడేలా చేస్తాయి. గురకను తగ్గిస్తాయి.