ఒక వంటకం రుచిని పూర్తిగా మార్చేయగల ముఖ్యమైన పదార్థాలలో ఒకటి ఉప్పు. అయినప్పటికీ మనం రోజూ తీసుకునే సాధారణ ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనదని కూడా మనకు తెలుసు. కారణం.. సోడియం రక్తపోటు (హైబీపీ) స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు కారణమవుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అధిక రక్తపోటు మూడవ అతి ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంది. సుమారుగా 33 శాతం పట్టణ, 25 శాతం గ్రామీణ భారతీయులు రక్తపోటుతో బాధ పడుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. అయితే మరోవైపు మనం ఉప్పు తినకుండా ఉండలేం. మరలాంటప్పుడు నిత్యం ఎంత మోతాదులో ఉప్పు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చ ? ఉప్పును ఆరోగ్యకరమైన మోతాదులో ఎంత మేర తీసుకోవాల్సి ఉంటుంది ? ఉప్పు వల్ల సమస్యలు రావొద్దంటే దాన్ని ఎంత మోతాదులో నిత్యం తినవచ్చు ? అంటే..
ఉప్పులోని సోడియం అధిక రక్తపోటు, ఇతర గుండె సంబంధ వ్యాధులకు కారణం అయినప్పటికీ అది మన శరీరానికి అవసరం. మన శరీరంలో ఉప్పు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సోడియం రక్తంలో కరిగిపోతుంది. ఇది రక్తం ద్రవ భాగాన్ని మరింతగా నిర్వహించడానికి నీటిని ఆకర్షిస్తుంది. హైడ్రేషన్, రక్తపోటు, నరాలు, కండరాలు సరైన పనితీరును కలిగి ఉండేందుకు, వివిధ శారీరక విధులను నియంత్రించడానికి సోడియం శరీర కణాలకు కీలకమైన ఎలక్ట్రోలైట్‌గా కూడా పనిచేస్తుంది.
ఉప్పు మన శరీరంలో కొన్ని ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. అది మనకు అవసరమే. అయితే దాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని నాశనం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సోడియం అధికంగా తీసుకుంటే.. అంటే నిత్యం ఉప్పును ఎక్కువగా తింటే.. కింద తెలిపిన లక్షణాలు కనిపిస్తాయి.
1. మెదడు పనితీరు మందగిస్తుంది. బద్దకంగా అనిపిస్తుంది.
2. నిర్జలీకరణం (డీ హైడ్రేషన్) బారిన పడతారు.
3. శరీరంలో నీరు ఎక్కువవుతుంది. అధిక బరువు పెరుగుతారు.
4. కిడ్నీలో రాళ్ళు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.
5. జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడుతాయి.
6. అధిక రక్తపోటు (హైబీపీ) సంభవిస్తుంది.
7. కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
8. ధమనులు దెబ్బ తింటాయి.
వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం.. రోజుకు 2400 మిల్లీగ్రాముల ఉప్పును తీసుకోవచ్చు. అందువల్ల ఎలాంటి హాని కలగదు. అయితే పోషకాహార లోపం ఉన్నవారు. అదనంగా మరో 1.5 మిల్లీగ్రాముల ఉప్పును తీసుకోవచ్చు. ఇక ఉప్పును తగినంతగా తీసుకోకపోతే కండరాల తిమ్మిరి, వాంతులు, మైకం, వికారం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ప్రతిరోజూ 5 గ్రాముల కన్నా ఎక్కువగా ఉప్పును తినకూడదని వైద్య నిపుణులు తెలిపారు.
సోడియం స్థాయిలు పెరగకుండా, తగ్గకుండా ఉండేలా శరీరం ఎప్పటికప్పుడు విధులు నిర్వహిస్తుంది. కిడ్నీలు కూడా సోడియం స్థాయిల విషయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సోడియం స్థాయిలు తగ్గితే కిడ్నీలు సోడియంను వెనక్కి పంపుతాయి. అదే సోడియం స్థాయిలు ఎక్కువైతే దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఇక హైబీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు ఉప్పును తినాల్సి ఉంటుంది. వారు ఎంత తక్కువ ఉప్పును తింటే అంత మంచిది.