హెల్త్ టిప్స్

నిత్యం 8 గంట‌ల నిద్రకూడా మ‌న‌కు చాల‌ద‌ట‌.. ఇంకా ఎక్కువ కావాల‌ట‌..!

నిద్ర మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంద‌రు అంత‌క‌న్నా చాలా త‌క్కువ స‌మ‌యం పాటే నిద్రిస్తే.. మరికొంద‌రు క‌చ్చితంగా 8 గంట‌లు ప‌డుకుంటారు. కానీ నిజానికి 8 గంట‌ల నిద్ర కూడా స‌రిపోద‌ని ఓ ప్ర‌ముఖ సైంటిస్టు చెబుతున్నారు. అవును.. మ‌నం రోజుకు క‌చ్చితంగా 8 గంట‌లు కాదు, మరో 30 నిమిషాల పాటు.. అంటే మొత్తం ఎనిమిదిన్న‌ర గంట‌ల పాటు నిద్ర‌పోవాలట‌. ఇందుకు ఆ సైంటిస్టు వివ‌ర‌ణ కూడా ఇస్తున్నారు. అదేమిటంటే…

డ్యాన్ గార్టెన్‌బ‌ర్గ్ అనే సైంటిస్టు ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయ‌న చెప్పిందేమిటంటే.. మ‌నం నిత్యం 8 గంట‌ల పాటు నిద్ర‌పోయినా స‌రే మ‌రో 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రించాల్సిందేన‌ని ఆయ‌న అంటున్నారు. ఎందుకంటే.. రాత్రి పూట మ‌నం ప‌డుకోగానే నిద్ర‌పోం క‌దా. అలాగే నిద్ర లేచే ముందు మ‌న‌కు మెళ‌కువ వ‌స్తుంది. అయినా నిద్ర‌పోయిన‌ట్టుగా క‌ళ్లు మూసుకుంటాం. దీనికి తోడు.. మ‌నం 8 గంట‌ల పాటు నిద్రించామ‌ని భావిస్తాం. కానీ 7.2 గంట‌ల పాటు మాత్ర‌మే ప‌డుకుంటామ‌ట‌. ఇదే విష‌యాన్ని ఆయన త‌న ప‌రిశోధ‌న‌లో తేల్చారు.

do you know that we need more than 8 hours of sleep

క‌నుక ఎవ‌రైనా నిత్యం 8 గంట‌ల పాటు నిద్రిస్తున్నామ‌నుకుంటే పొర‌పాటు. మ‌రో 30 నిమిషాలు అద‌నంగా నిద్రించాల్సిందేన‌ని, దీంతో క‌చ్చితంగా 8 గంట‌ల నిద్ర పూర్త‌వుతుంద‌ని డ్యాన్ గార్టెన్‌బ‌ర్గ్ చెబుతున్నారు. అయితే ఉద‌యం 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రించ‌లేమ‌ని అనుకునేవారు మ‌ధ్యాహ్నం ఆ స‌మ‌యాన్ని పూర్తి చేయ‌వ‌చ్చ‌ని గార్టెన్‌బ‌ర్గ్ అంటున్నారు. అంటే.. మ‌ధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రిస్తే చాలు.. రోజు కోటా 8 గంట‌ల నిద్ర పూర్త‌వుతుంద‌ట‌. దీని వ‌ల్ల చురుగ్గా ప‌నిచేయ‌వ‌చ్చ‌ని కూడా గార్టెన్‌బ‌ర్గ్ చెబుతున్నారు. మ‌రింకెందుకాల‌స్యం.. చురుగ్గా ఉండాలంటే మీరు కూడా ఈ సూచ‌న ఫాలో అయిపొండి మ‌రి..!

Admin

Recent Posts