చింతపండును మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తామని తెలిసిందే. దీంతో పప్పు చారు, పులుసు, పులిహోర, పచ్చడి వంటి వంటకాలను చేసుకుంటాం. చింత పండు వల్ల అవి ఎంతో రుచిగా ఉంటాయి కూడా. అయితే కేవలం రుచిని మాత్రమే కాదు, చింత పండు మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని తరచూ వంటల్లో ఉపయోగించడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు కూడా. ఈ క్రమంలో చింత పండు వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.
విటమిన్ ఇ ఎక్కువగా ఉన్నందున చింత పండు పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే స్త్రీలలో అయితే రుతు సమస్యలను పోగొడుతుంది. చింతపండులో ఉండే కాల్షియం ఎముకలకు మంచిది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. బి విటమిన్లు, పాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు. అదేవిధంగా దీంట్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య నుంచి మనల్ని బయట పడేస్తుంది. చింతపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే లాక్సేటివ్ గుణాలు ఉండడం వల్ల మలబద్దకాన్ని పోగొడుతుంది.
బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. వారి రక్తంలో ఉండే షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. శరరీంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. చింత పండును తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (హెచ్‌సీఏ) అనే ఓ సమ్మేళనం ఉంటుంది. ఇందువల్ల చింత పండును తినగానే మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గేందుకు చాన్స్ ఉంటుంది. చింతపండులో ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని ఎక్కువగా మాత్రం తినకూడదు. ఎందుకంటే చింత పండును అతిగా సేవిస్తే గ్యాస్, అసిడిటీ, విరేచనాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.