Gym : గత కొన్ని నెలలుగా వ్యాయామశాలల్లో గుండెపోటుతో మరణాలు సంభవించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వయసు పైబడిన వారి కంటే యువతే ఎక్కువగా ఇలా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మరణిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. అసలు వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఏమిటి…మనం వ్యాయామం చేసేటప్పుడు అసలు గుండెలో ఏం జరుగుతుంది… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతుంది. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు సరిగ్గా పని చేయడానికి ఆక్సిజన్ ఎక్కువగా అవసరమవుతుంది. ఆక్సిజన్ ను అందించడానికి అలాగే వ్యర్థపదార్థాలను తొలగించడానికి గుండె కండరాలకు ఎక్కువ రక్తాన్ని సరఫరా చేస్తుంది.
శరీర సామర్య్థం కంటే ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు గుండె రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బంది పడుతుంది. తగిన శ్రద్ద చూపించకపోతే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జిమ్ లో వ్యాయామం చేసిన ప్రతిసారి గుండెపోటు రాదు. వ్యాయామం చయడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వ్యాయామం చేసేటప్పుడు శరీర సామర్థ్యానికి అనుగుణంగా చేయాలి. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అలగే వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే విశ్రాంతి తీసుకోవడం వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడనట్టుగా ఉండడం, తలనొప్పి, కండరాల్లలో తీవ్రమైన నొప్పులు, అలసట, తలతిరిగినట్టుగా ఉండడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాయామం చేయడం ఆపేసి తగిన విశ్రాంతి తీసుకోవాలి.
ఇవి గుండెపోటు వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలు కనుక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చాలా మంది వ్యాయామం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందనే భయంతో వ్యాయామం చేయడం మానేస్తున్నారు. కానీ వ్యాయామం చేయడం వల్ల అన్ని సందర్భాల్లలో గుండెపోటు రాదు. వ్యాయామం చయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు ఉన్న వారు కూడా వ్యాయామం చేయవచ్చు. మన శరీరానికి తగినట్టుగా వ్యాయామం చేస్తూ తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదు.