Dragon Fruit For Diabetes : డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే మనం జీవితాంతం మందులు మింగాల్సిందే. అలాగే వారు తీసుకునే ఆహారం విషయంతో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏది పడితే అది తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ఉండే ఆహారాలను తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో పాటు డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే ఆహారాలల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు డ్రాగన్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది.
ఈ పండ్లు మనకు మార్కెట్ లో విరివిగా లభిస్తూ ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ పండు యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 48 నుండి 52 మధ్య ఉంటుంది. ఈ పండును తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు ఈ పండును 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల 60 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
ఒకవేళ ఇతర పండ్లతో కలిపి సలాడ్ రూపంలో తీసుకుంటే 50 గ్రాముల కంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ పండును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు కూడా డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ను నేరుగా తీసుకోవడంతో పాటు వీటితో స్మూతీ, జ్యూస్ వంటి వాటిని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని దీనిని ప్రతిఒక్కరు వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.