హైబీపీ సమస్యలాగే కొందరికీ లో బీపీ సమస్య ఉంటుంది. దీన్నే లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపో టెన్షన్ అని పిలుస్తారు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. బాధితుల వయస్సు, ఆరోగ్య చరిత్ర, ఇతర స్థితిగతుల ఆధారంగా లో బీపీ సమస్య అనేది మారుతుంటుంది. అందరిలోనూ ఒకేలా ఉండదు. అయితే చాలా తక్కువ లో బీపీ ఉంటే మాత్రం తలతిరగడం సంభవిస్తుంది. తరువాత స్పృహ తప్పి పడిపోతారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు బీపీ 90/60 నుంచి 120/80 మధ్య ఉంటుంది. కానీ 90/60 కన్నా తక్కువ బీపీ ఉంటే దాన్ని లో బీపీగా పరిగణించాలి.
లో బీపీ సమస్య ఉన్నవారిలో కంటి చూపు మసకగా ఉండడం, ఆందోళన, కంగారు, ఏకాగ్రత లోపించడం, దేనిపై సరిగ్గా ధ్యాస పెట్టలేకపోవడం, తల తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం, నీరసం, వికారం, వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే లో బీపీ ఉన్నవారికి పల్స్ వేగంగా ఉండడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, శరరీం చల్లగా మారడం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందించాలి.
ఇక లో బీపీ సమస్య ఉన్నవారు కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
1. లో బీపీ సమస్య ఉన్నవారు రోజూ ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. డీహైడ్రేషన్ సమస్య కారణంగా రక్తం పరిమాణం తగ్గుతుంది. దీంతో బీపీ తక్కువవుతుంది. అందువల్ల నీటిని లేదా ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇది లో బీపీ రాకుండా చూస్తుంది.
2. శరీరంలో తగినంత విటమిన్ బి12 లేకపోయినా బీపీ తగ్గుతుంది. అలసట వస్తుంది. అందువల్ల బి12 విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, తృణ ధాన్యాలు, మటన్ లివర్, న్యూట్రిషనల్ ఈస్ట్, చికెన్ బ్రెస్ట్, పెరుగు, చేపలు వంటి పదార్థాల్లో బి12 అధికంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల లోబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. ఫోలేట్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేసేందుకు దోహదపడుతుంది. అందువల్ల ఫోలేట్ ఉండే ఆహారాలను తీసుకుంటే లో బీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. ఫోలేట్ ఎక్కువగా నిమ్మజాతి పండ్లు, పప్పు దినుసులు, బీన్స్, ఆకుపచ్చని కూరగాయలు, గుడ్లు, లివర్‌లలో లభిస్తుంది. వీటిని తింటే లో బీపీ రాకుండా చూసుకోవచ్చు.
4. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. హైబీపీ ఉన్నవారికి మంచిది కాదు. కానీ లోబీపీ ఉన్నవారు ఉప్ప ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. దీంతో బీపీ పెరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా సూప్‌లు, చీజ్, పనీర్, చేపలు, ఊరగాయలు తినడం వల్ల ఉప్పు ఎక్కువగా లభిస్తుంది. ఇది లో బీపీ సమస్యను తగ్గిస్తుంది.
5. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ లను తాగడం వల్ల తాత్కాలికంగా బీపీ పెరుగుతుంది. బీపీ మరీ తక్కువగా ఉందనుకునే వారు వీటిని తాగితే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. అయితే కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. కనుక కాఫీ, టీలను మోతాదులో మాత్రమే తాగాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365