Eucalyptus Oil : మీకు యూకలిప్టస్ ఆయిల్ తెలుసా..? అదేనండీ.. మన దగ్గర చాలా మంది దాన్ని నీలగిరి తైలం అంటారు. అవును అదే. ఈ ఆయిల్ వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఈ తైలాన్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. మరి ఈ ఆయిల్ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. నీలగిరి తైలాన్ని వాసన చూస్తే చాలు మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిత్యం ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యేవారు కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వాసన చూడండి. అంతే.. బాడీ, మైండ్ రెండూ రిలాక్స్ అవుతాయి. ప్రశాంతత లభిస్తుంది. నీలగిరి తైలం నుంచి వచ్చే వాసన అరోమాథెరపీలా పనిచేసి మనకు కలిగే ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.
వెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడేవారు నీలగిరి తైలాన్ని రోజూ కొంత మోతాదులో తీసుకుని జుట్టుకు మర్దనా చేయాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. నిత్యం మీరు వాడే పేస్టులో యూకలిప్టస్ ఆయిల్‌ను కలిపి దంతాలను తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తళతళా మెరుస్తాయి. జుట్టులో పేలు బాగా ఉన్నవారు నీలగిరి తైలాన్ని తరచూ మర్దనా చేసి తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
ముక్కు దిబ్బడ, జలుబు ఉన్నవారు నీలగిరి తైలం వాసన చూస్తే చాలు ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనాల సమస్యతో బాధపడేవారి పొట్టపై కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్‌ను రాయాలి. పొట్ట చుట్టూ సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, కండరాల నొప్పులు ఉన్నవారు నొప్పి ఉన్న ప్రదేశంలో యూకలిప్టస్ ఆయిల్‌ను రాసి బాగా మర్దనా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ తైలంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లకు ఈ ఆయిల్ ఔషధంగా పనిచేస్తుంది. సంబంధిత ప్రదేశంపై ఈ ఆయిల్‌ను తరచూ రాస్తుంటే గాయాలు మానిపోతాయి. దెబ్బలపై రాస్తే నొప్పి, మంట తగ్గుతాయి. పుండ్లు కూడా తగ్గుతాయి.