కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు హెర్బల్ టీలు, కషాయాలను ఎక్కువగా తాగుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు వాటిని తాగడం అవసరమే. అయితే కొందరు వాటిని మితిమీరిన మోతాదులో సేవిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని అలా అతిగా సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమని సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు హెర్బల్ టీ లేదా కషాయం ఏదైనా సరే 2 సార్లు తాగవచ్చు. తాగినప్పుడల్లా 50 ఎంఎల్ మోతాదుకు మించరాదు. అంతకన్నా ఎక్కువ సేవిస్తే దుష్పరిణామాలు కలుగుతాయి. ముఖ్యంగా హైపర్ అసిడిటీ, అజీర్ణం, అల్సర్లు, కడుపులో మంట, మూత్రంలో మంట, దద్దుర్లు, మొటిమలు వస్తాయి.
ఈ క్రమంలోనే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. శరీరంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు, సూక్ష్మ జీవులను బయటకు పంపేందుకు నిరంతరం గోరు వెచ్చని నీటిని తాగాలని సూచించింది. దీంతో జీర్ణాశయ వ్యవస్థ శుభ్రమవుతుంది. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో ఉండే ప్లీహం కరుగుతుంది. దగ్గు, గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొందరు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వంటి పదార్థాలను అతిగా ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. అవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వాటిని అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇక కారంగా ఉండే పదార్థాలను తినడం వల్ల జఠరాగ్ని పెరుగుతుంది. మెటబాలిజం గాడిలో పడుతుంది. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మసాలా దినుసుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే కారం, మసాలా పదార్థాలు మంచివే అయినా వాటిని కూడా అతితా తీసుకోరాదు. తీసుకుంటే జీర్ణాశయ గోడలు దెబ్బతింటాయి. దీంతో గ్యాస్ట్రైటిస్, అల్సర్లు, పేగుల్లో సమస్యలు, కొలైటిస్ వంటి సమస్యలు వస్తాయి. పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిలలో సహజంగానే వేడి చేసే గుణాలు ఉంటాయి. కనుక వాటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఇక రక్తస్రావం అయ్యే వ్యాధులు ఉన్నవారు, హెమరాయిడ్స్ ఉన్నవారు పసుపు, జీలకర్రను వాడకూడదు.
ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కఫ దోషం తగ్గుతుంది. గొంతులో పొడిగా ఉండడం నుంచి బయట పడవచ్చు. పెదవులు మృదువుగా మారుతాయి. నోటి సమస్యలు ఉండవు. కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ఇక నిమ్మరసం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ దాన్ని కూడా మితంగానే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ అల్సర్, గుండెల్లో మంట, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కనుక నిమ్మరసాన్ని కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి.
నల్ల మిరియాలు, నిమ్మ, వెల్లుల్లి, దాల్చిన చెక్కలను వేసి కొందరు కషాయం కాచి తాగుతారు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఉదయం 50 ఎంఎల్, సాయంత్రం 50 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. మితిమీరితే అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365