Kidneys : మన శరీరంలో నిరంతరం పని చేసే అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. యూరిన్ ను తయారు చేయడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, శరీరంలో వ్యర్థాలు బయటకు పంపించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలా మంది మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడే వాటి విలువ మనకు తెలుస్తుంది. మన శరీర జీవక్రియల్లో మూత్రపిండాలు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. వీటి ఆరోగ్యాన్ని పరరక్షించుకోవడం చాలా అవసరం. మన శరీరంలో మూత్రపిండాలు నిర్వర్తించే విధుల గురించి వీటిని ఎందుకు మనం పరిశుభ్రంగాఉంచుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎముక మజ్జలో తయారవుతాయి. ఈ ఎర్ర రక్తకణాలు తయరవ్వాలంటే ఎరిత్రోపొయోటిన్ అనే హార్మోన్ చాలా అవసరం.
ఎర్ర రక్తకణాలు తయారవ్వడానికి అవసరమయ్యే ఈ హార్మోన్ ను మూత్రపిండాలు విడుదల చేస్తాయి. మూత్రపిండాలు దెబ్బతిన్న వారిలో ఎక్కువగా రక్తహీనత సమస్య వస్తుంది. వారి శరీరంలో నీరు చేరి ఉబ్బి పోతూ ఉంటారు. రక్తహీనత సమస్య రాకుండా ఉండాలంటే మూత్రపిండాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఎ సి ఇ అనే ఎంజైమ్ ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎంజైమ్ చక్కగా విడుదల అయితేనే రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల రక్తపోటు అదుపులో లేకుండా పోతుంది. అలాగే రక్తపోటు ఎక్కువగా ఉన్నా కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో మూత్రపిండాలు త్వరగా దెబ్బతింటాయి. కనుక మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.

అలాగే ఎముకలు ధృడంగా ఉంచడంలో, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో, రక్షణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ డి ని సూర్యరశ్మి ద్వారా చర్మం తయారు చేసుకుంటుంది. ఇలా తయారైన విటమిన్ డి ఎటువంటి పని చేయకుండా కాలేయంలో నిర్జీవంగా ఉంటుంది. ఇలా నిర్జీవంగా ఉన్న విటమిన్ డి ని ఉత్తేజపరచడంలో మూత్రపిండాలు సహాయపడతాయి. మూత్రపిండాలు ఉత్తేజపరిస్తేనే విటమిన్ డి శరీరానికి అందుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటే శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తుతుంది. అలాగే రక్తంలో లవణాలను, ఎలక్ట్రోలైట్స్ ను నియంత్రణలో ఉంచడంలో మూత్రపిండాలు ఎంతో దోహదపడతాయి. లవణాలు, ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు పెరిగితే అనారోగ్య సమస్యలు తలెత్తి మరణం సంభవించే అవకాశం ఉంది. కనుక ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు అదుపులో ఉండడం చాలా అవసరం.
కనుక మనం మూత్రపిండాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. అదే విధంగా కాలేయం వడకట్టిన వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి. ఈ వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపించకపోతే కాలేయంపై ఒత్తిడి ఎక్కువయ్యి కాలేయ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక మనం మూత్రపిండాలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజూ కొన్ని నియమాలను పాటించాలి. ప్రతిరోజూ 4 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మూత్రపిండాల్లో మలినాలు పేరుకుపోకుండా ఉంటాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఉప్పు బాగా దెబ్బతీస్తుంది. కనుక ఉప్పును తక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే ఉప్పే మన శరీరానికి సరిపోతుంది. మనం ఆహారాల్లో వేసుకునే ఉప్పంతా మన మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
కనుక ఉప్పును మనం వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మాంసంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం మాంసాన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్నకుండా చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.