Cholesterol : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్‌డీఎల్. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. హెచ్‌డీఎల్ అని ఇంకొక కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. మనం పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్స్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. అయితే మన శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయి తక్కువగా ఉండాలి. అందుకు గాను హెచ్‌డీఎల్ పనిచేస్తుంది. ఈ క్రమంలోనే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలంటే అందుకు కింద తెలిపిన పలు సహజసిద్ధమైన మార్గాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్‌డీఎల్ స్థాయిలు పెరగాలంటే రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం రోజుకు 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజులు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. హెచ్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవాలంటే ఆలివ్ నూనెను వాడడం ఉత్తమం. ఇది ఎల్‌డీఎల్‌ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
రోజుకు తగినన్ని గంటలపాటు నిద్రించడం వల్ల కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవచ్చు. చాలా మంది రోజూ సరిగ్గా నిద్రించరు. దీని వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. కనుక నిద్ర కూడా చాలా ముఖ్యమే. ఇక ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. దీని వల్ల కూడా ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా పలు సహజసిద్ధమైన మార్గాలను అనుసరించడం ద్వారా ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.