మనలో అధిక శాతం మంది రాత్రి పూట భోజనం పట్ల అంతగా శ్రద్ధ చూపించరు. ఇష్టం వచ్చింది తింటారు. హోటల్స్, రెస్టారెంట్లు, బయట చిరుతిళ్లు.. బిర్యానీలు, మసాలా పదార్థాలు, స్వీట్లు రాత్రి పూట తెగ లాగించేస్తారు. కానీ నిజానికి రాత్రి పూట అంత హెవీగా భోజనం చేయకూడదు. చాలా లైట్‌గా భోజనం చేయాలి. అలాగే భోజనంలో కింద తెలిపిన పదార్థాలు తీసుకోవాలి. పలు సూచనలు కూడా పాటించాలి. దాంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
* రాత్రి భోజనంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, ఫ్రాజెన్ ఫుడ్, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న పదార్థాలను తినరాదు. వాటి వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* రాత్రి భోజనంలో పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకోవాలి. అలాగే అన్నానికి బదులుగా చపాతీలను తింటే మంచిది. ఇక రాత్రి భోజనంలో వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలి. లేదంటే శరీరంలో నీరు ఎక్కువగా చేరుతుంది.
* ఆకుకూరలు, కూరగాయలను రాత్రి పూట ఎక్కువగా తినాలి. దీంతో జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. అలాగే రాత్రి చక్కెరకు బదులుగా తేనె వాడితే మంచిది. ఇక రాత్రి గోరు వెచ్చని పాలు తాగాలి. అందులో చక్కెరకు బదులుగా తేనె కలుపుకోవాలి.
* రాత్రి భోజనం చేశాక కనీసం 3 గంటలు ఆగాకే నిద్రించాలి. దీంతో నిద్ర చక్కగా పట్టడమే కాదు, అధికంగా బరువు పెరగకుండా ఉంటారు. గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
* రాత్రి పూట మన శరీరానికి అంతగా శక్తి అవసరం లేదు. కనుక ఆహారాన్ని తగ్గించి తినాలి. లేదంటే అధికంగా తినే ఆహారం కొవ్వు కింద మారుతుంది. ఫలితంగా అధికంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.