Foods For Fatty Liver : నేటి తరుణంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యలల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. ఉండాల్సిన బరువు కంటే 10 నుండి 15 కిలోలు ఎక్కువ బరువు ఉన్నవారిలో ఈ సమస్య వస్తుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేసే కొద్ది భవిష్యత్తులో మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయంలో ఉండే కణాలు వారి విధులను సక్రమంగా నిర్వర్తించవు. శరీరంలో మలినాలను, విష పదార్థాలను తొలగించే డిటాక్సిఫికేషన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. తద్వారా శరీరంలో మలినాలు పేరుకుపోయి మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాకుండా కాలేయ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
కనుక ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని నియమాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు రోజూ సాయంత్రం 6 గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. అది కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. పండ్లను తీసుకోవడం వల్ల సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు శక్తి తక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కనుక రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం వరకు మన శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇలా పండ్లను తీసుకోవడం వల్ల శక్తి తక్కువగా లభిస్తుంది కనుక మన శరీరం శక్తిని నిల్వ ఉన్న కొవ్వు నుండి గ్రహిస్తుంది. దీంతో కాలేయానికి పట్టిన కొవ్వు కూడా కరుగుతుంది.
అంతేకాకుండా కాలేయం పూర్తిగా శుభ్రమవుతుంది. దీనితో పాటు వారంలో ఒకరోజు ఉపవాసం చేయాలి. నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగుతూ ఒక రోజంతా ఉపవాసం ఉండాలి. ఇలా ఉండడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి అంతా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నుండి లభిస్తుంది. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే రోజూ మధ్యాహ్నం అన్నానికి బదులుగా రెండు పుల్కాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో, కాలేయంలో ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇలా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. వాకింగ్, యోగా వంటివి చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. వీటితో పాటు జంక్ ఫుడ్ కు, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఈ విధంగా తగిన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల రెండు నుండి మూడు నెలలో ఫ్యాటీలివర్ సమస్య తగ్గుతుందని కాలేయం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.