చర్మం పొడిగా మారడం.. మచ్చలు ఏర్పడడం.. ముఖంపై మొటిమలు రావడం.. చర్మం రంగు మారడం.. వంటి అనేకమైన చర్మ సమస్యలు మనలో అధిక శాతం మందికి ఉంటాయి. అయితే వాటిని తగ్గించుకోవడం కోసం కొందరు అనేక చిట్కాలను పాటిస్తుంటారు. కానీ.. వాటితోపాటు చర్మాన్ని సంరక్షించే.. పోషకాలు కలిగిన ఆహారాలను కూడా మనం నిత్యం తీసుకోవాలి. కింద తెలిపిన పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే.. తద్వారా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. మరి చర్మ సంరక్షణకు నిత్యం మనం తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఆపిల్ పండ్లలో మాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ (మృత కణాలు)ను తొలగించడంలో బాగా పనిచేస్తుంది. పొటాషియం ఈ పండ్లలో అధికంగా ఉండడం వల్ల చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఆపిల్స్‌లో ఉండే కాపర్ చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మ కణాలను బాగు చేస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి నాశనమైన చర్మ కణజాలాలకు పునరుత్తేజం కలిగిస్తుంది. ఆపిల్స్‌లో ఉండే పీచు పదార్థం మొటిమలు రాకుండా చూస్తుంది.
అరటి పండ్లు మన చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మానికి సహజ సిద్ధంగా ఉండే సాగే గుణాన్నిఈ పండ్లు నియంత్రణలో ఉంచుతాయి. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే చర్మంపై ఏర్పడే మచ్చలు తగ్గుతాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలను తగ్గించే యాంటీ ఏజింగ్ గుణాలు అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతుంది. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది.
పుచ్చకాయలను బాగా తినడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మంలో ఉండే ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు తగ్గుతాయి. పుచ్చకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి.
దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. దానిమ్మ పండ్లను నిత్యం తింటే చర్మం సంరక్షింపబడుతుంది. చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది. తిరిగి పూర్వ రూపాన్ని సంతరించుకుంటుంది.
బొప్పాయి పండ్లలో ఉండే విత్తనాలు చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుతాయి. వీటిలోని ఎంజైమ్‌లు చర్మాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో చర్మానికి మెరుపు వస్తుంది.
నారింజ పండ్లను తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి. చర్మంపై ఉండే మృతకణాలు తగ్గుతాయి. నారింజలో ఉండే విటమిన్ సి ఎండ, కాలుష్యం కారణంగా రంగు మారిన చర్మానికి తిరిగి పూర్వపు రంగు, స్థితిని తీసుకువస్తుంది.
పైనాపిల్‌ను నిత్యం తినడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.