Fruits For Sleep : నేటి తరుణంలో మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మారిన మన జీవనవిధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. ఒత్తిడి, ఆందోళన, శరీరంలో ఉండే ఇతర అనారోగ్య సమస్యలు, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల చేత మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిద్రలేమి కారణంగా మన శరీరం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది. కనుక రోజూ తగినంత నిద్రపోవడం చాలా అవసరం. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటికి బదులుగా సహజంగా లభించే పండ్లను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు.
నిద్రలేమితో బాధపడే వారు అరటి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. అరటి పండ్లను తీసుకోవడం వల్ల మెదడుకు విశ్రాంతి లభించడంతో పాటు నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. చెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చెర్రీ పండ్ల జ్యూస్ లేదా నేరుగా చెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం మెలుకువ లేకుండా నిద్రపోవచ్చు. నిద్రలేమితో బాధపడే వారికి పైనాపిల్ మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిలో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ లతో పాటు యాంటీ ఇన్ ప్లామటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల కండరాలకు విశ్రాంతి లభించడంతో పాటు చక్కటి నిద్రను పొందవచ్చు. ఇక సాయంత్రం సమయాల్లో కివి పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.
దీనిలో ఉండే విటమిన్ సి, సెరోటోనిన్ లు మంచి నాణ్యమైన నిద్రను అందించడంలో సహాయపడతాయి. అలాగే నిద్రపోవడానికి ముందు నారింజ పండ్లను తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్ సి, సహజ చక్కెరలు మంచి నిద్రను అందించడంలో సహాయపడతాయి. అదే విధంగా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియంతో పాటు అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. సాయంత్రం సమయంలో బొప్పాయి పండును తీసుకోవడం వల్ల శరీరం నిద్రకు సిద్దమవుతుంది. ఇక చివరగా ఆపిల్ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆపిల్ పండ్లను స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పండ్లను రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిద్రలేమి సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.