Gas Trouble Health Tips : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. కడుపులో గ్యాస్ కారణంగా కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. గ్యాస్ సమస్య చిన్నదే అయినప్పటికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. దీని నుండి బయటపడడానికి చాలా మంది టానిక్ లను, మందులను వాడుతూ ఉంటారు. అయితే వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా మందులను వాడడానికి బదులుగా సహజంగా కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చని వారు చెబుతున్నారు.
గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఖచ్చితంగా నాలుగు నిమయమాలను పాటించాలని దీంతో గ్యాస్ సమస్య నుండి చాలా సులభంగా సహజ సిద్దంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడే వారు పాటించాల్సిన నాలుగు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సమస్యతో బాధపడే వారు మలవిసర్జన సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున లీటర్నర నీటిని తాగి మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి. ఒక గంట తరువాత మరలా ఒక లీటర్ నీటిని తాగి మరలా రెండోసారి మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి. చల్లటి నీటిని తాగలేని వారు గోరు వెచ్చని నీటిని తాగాలి.
ఇలా నీటిని తాగి రోజూ రెండు సార్లు మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేయడం వల్ల ప్రేగుల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ప్రేగుల్లో వ్యర్థాలు, మలం నిల్వ ఉండడం వల్ల గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది. కనుక ప్రేగులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఆహారం తీసుకునేటప్పుడు నీటిని తాగకూడదు. ఆహారం తీసుకునేటప్పుడు నీటిని తాగడం వల్ల పొట్టలో ఊరిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ పలుచగా అవుతుంది. దీంతో మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉండడం వల్ల గ్యాస్ తయారవుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువగా నములుతూ తీసుకోవాలి. అలాగే చిన్న ముద్దల రూపంలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల తినేటప్పుడు గొంతుపట్టకుండా ఉంటుంది. నీటిని తాగే అవసరం లేకుండా ఉంటుంది. ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత మాత్రమే నీటిని తీసుకోవాలి.
అదే విధంగా గ్యాస్ సమస్యతో బాధపడే వారు రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. చాలా మంది భోజనానికి భోజనానికి మధ్యలో కూడా ఆహారాన్ని, చిరుతిళ్లను తీసుకుంటూ ఉంటారు. రోజుకు 4 నుండి 5 సార్లు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవ్కక గ్యాస్ సమస్య తలెత్తుతుంది. కనుక ఆహారాన్ని రోజుకు మూడుసార్లు మాత్రమే తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. అలాగే పొట్టను 80 శాతం మాత్రమే ఆహారంతో నింపాలి. మిగిలిన 20 శాతం ఖాళీగా ఉంచాలి. ఆహారాన్ని ఎక్కువగా నమిలి తీసుకోవడంతో పాటు పొట్టను కొద్దిగా ఖాళీగా ఉంచడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ నాలుగు నియమాలను పాటించడం వల్ల గ్యాస్ సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తుల్లో కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.