కరోనా నేపథ్యంలో అప్పట్లో మాంసాహార ప్రియులు చికెన్ తినడం మానేశారు. అయితే చికెన్, మటన్ తినడం వల్ల కరోనా రాదని నిపుణులు చెప్పడంతో చికెన్ ను మళ్లీ తినడం ప్రారంభించారు. ఇక దేశంలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో మళ్లీ చికెన్‌ను తినడం మానేస్తున్నారు. చికెన్ తింటే మనకు ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి. అయితే చికెన్‌ను తినకపోతే ఈ పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. కానీ చికెన్ తినకపోయినా సరే మనకు శాకాహారం ద్వారా కూడా ప్రోటీన్లు లభిస్తాయి. మరి ఆ ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
పప్పు దినుసులు, బీన్స్ లలో ప్రోటీన్లు, ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఒక కప్పు ఉడకబెట్టిన పప్పు దినుసుల ద్వారా 1 గ్రాము వరకు ప్రోటీన్లు లభిస్తాయి. మాంసం తినలేకపోయినా పప్పు దినుసులను తినడం ద్వారా అధిక మొత్తంలో ప్రోటీన్లను పొందవచ్చు. అలాగే బి విటమిన్లు, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు కూడా వీటి ద్వారా లభిస్తాయి.
బ్లాక్ బీన్స్‌లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, క్యానర్ రాకుండా చూస్తాయి. అలాగే శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేసేలా చేస్తాయి. దీంతో బరువు తగ్గవచ్చు. ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన ఇతర పోషకాలు వీటిల్లో సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల వీటిని తిన్నా ప్రోటీన్లను పొందవచ్చు. ఒక కప్పు ఉడకబెట్టిన బ్లాక్ బీన్స్ మనకు 8 గ్రాముల వరకు ప్రోటీన్‌లను అందిస్తాయి.
శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. అధిక బరువును, షుగర్‌ను నియంత్రిస్తాయి. ఒక కప్పు ఉడకబెట్టిన శనగలను తినడం వల్ల ఏకంగా 15 గ్రాముల వరకు ప్రోటీన్లను పొందవచ్చు.
సోయా బీన్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ఫ్యాట్ ఉండదు. ఐరన్ లభిస్తుంది. ఒక కప్పు ఉడకబెట్టిన సోయా బీన్స్‌తో ఏకంగా 31 గ్రాముల వరకు ప్రోటీన్లు లభిస్తాయి. 100 గ్రాముల పన్నీర్‌లో 10 నుంచి 19 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా ప్రోటీన్లు పొందవచ్చు. ఇలా బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినలేని వారికి ఈ ఆహారాలను తినడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి.