Dates : ప్రకృతి ప్రసాదించిన అతిమధురమైన మరియు తక్షణ శక్తిని అందించే పండ్లల్లో ఖర్జూర పండు ఒకటి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే ఈ పండ్లు శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. 100 గ్రాముల మామిడి పండ్లల్లో 74 క్యాలరీలు, పనస తొనలు 84 క్యాలరీలు, సపోటా పండ్లు 94 క్యాలరీలు, సీతాఫలం 104 క్యాలరీలు, అరటి పండ్లు 116 క్యాలరీల శక్తిని కలిగి ఉంటాయి. అదే ఖర్జూర పండ్లు 144 క్యాలరీల శక్తిని కలిగి ఉంటాయి. ఇతర పండ్ల వలె ఖర్జూర పండ్లు కూడా కాలానుగుణంగా కాస్తాయి. కానీ ఈ పండ్లను కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వ చేసి సంవత్సరమంతా మనకు అమ్ముతూ ఉంటారు. అయితే తరుచూ కొనే పని లేకుండా ఈ ఖర్జూర పండ్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి మనం సంవత్సరమంతా కూడా వాడుకోవచ్చు.
దీని కోసం ఖర్జూర పండ్లను కొనుగోలు చేసి వాటిలో ఉండే గింజలను తీసివేయాలి. తరువాత ఈ ఖర్జూర పండ్లను రోట్లో లేదా జార్ లో వేసి వీలైనంత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.తరువాత ఈ పేస్ట్ ను సీల్డ్ కవర్ లో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి లేదా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖర్జూర పండ్లు పురుగు పట్టకుండా చాలా కాలం వరకు నిల్వ ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ఖర్జూర పండ్ల పేస్ట్ ను మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు. పంచదార, బెల్లం, తాటి బెల్లంకు బదులుగా ఈ ఖర్జూర పండ్ల పేస్ట్ ను మనం వాడుకోవచ్చు. జ్యూస్ లలో, పాలల్లో, తీపి వంటకాల్లో ఈ ఖర్జూర పండ్ల పేస్ట్ ను కలిపి తీసుకోవచ్చు.
ఈ పేస్ట్ తో కొబ్బరి ఉండలు, పుట్నాల పప్పు ఉండలు, డ్రై ఫ్రూట్స్ ఉండలు, బొబ్బట్లు ఇలా అనేక రకాల తీపి వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఇలా ఖర్జూర పండ్ల పేస్ట్ ను వాడుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత తగ్గుతుంది. ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. ఖర్జూర పండడ్ల పేస్ట్ పంచదార, బెల్లం వలె శరీరానికి, దంతాలకు హానిని కలిగించదు. దంతాలు పాడవకుండా ఉంటాయి. అయితే మనకు మార్కెట్ లో ఖర్జూర పండ్ల సిరప్, పేస్ట్ వంటివి లభిస్తాయి. అయితే వీటిని వాడకపోవడమే మంచిదని వీటిని నిల్వ చేయడానికి ఫ్రిజర్వేటివ్స్ ను వాడతారని నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులుగా ఇలా ఇంట్లోనే ఖర్జూర పండ్ల పేస్ట్ ను తయారు చేసి పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు ఈ పేస్ట్ ను సులభంగా వాడుకోవచ్చని అలాగే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.