భారతదేశం భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనం. అనేక వర్గాలకు చెందిన వారు మన దేశంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ తమ మతాలకు అనుగుణంగా అనేక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. అయితే ఏ వర్గానికి చెందిన వారు అయినా సరే తమ మత విశ్వాసాల ప్రకారం కొన్ని సార్లు ఉపవాసం ఉంటారు. దైవం కోసం ఉపవాస దీక్షలు చేపడుతారు. కొందరు వారంలో తమకు అనుకూలమైన రోజుల్లో ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం ఉండడం నిజానికి మంచిదే. దీని వల్ల లాభాలు కలుగుతాయని శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఇటీవలి కాలంలో విదేశాల్లోనూ ఫాస్టింగ్ అనే కల్చర్ పెరుగుతోంది. అయితే ఉపవాసం ఉండడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఉపవాసం ఉండడం వల్ల మనుషుల ఆయుర్దాయం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అంటే ఉపవాసం ఉండడం వల్ల ఎక్కువ సంవత్సరాల పాటు జీవించవచ్చన్నమాట.
* ఉపవాసం ఉండడం షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
* ఉపవాసం చేయడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఉపవాసం సమయంలో జీర్ణవ్యవస్థకు విరామం లభిస్తుంది. కనుక శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. ఈ సమయంలో శరీరం కొత్త కణాలను నిర్మించుకుంటుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. అందువల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* ఉపవాసం చేయడం వల్ల ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. ఏ పని చేసేందుకైనా ఏకాగ్రత అవసరం. కనుక ఉపవాసం చేయడం వల్ల ఏకాగ్రతను పెంచుకోవచ్చు. దీంతోపాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
* ఉపవాసంతో చర్మం మీద ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. అందుకనే ఎక్కువ కాలం పాటు జీవించగలుగుతారు.
* కొందరికి ఆకలి వేస్తే అస్సలు తట్టుకోలేరు. అలాంటి వారు ఏదో ఒక విధంగా ఉపవాసం చేయడం మొదలు పెడితే వారికి ఆకలి మీద నియంత్రణ వస్తుంది. అతిగా తినేవారు కూడా ఈ విధంగా చేయడం వల్ల తిండి మీద నియంత్రణ ఏర్పడుతుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
* ఉపవాసం చేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
* శరరీంలో కరగకుండా మొండిగా పేరుకుపోయే కొవ్వు సైతం ఉపవాసంతో కరుగుతుంది. అలాగే శరీర భాగాల్లో ఉండే వాపులు కూడా తగ్గుతాయి.
* ఉపవాసంతో శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు.
* కీళ్ల నొప్పులు ఉన్నవారు ఉపవాసం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు.