భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి అల్లంను తమ వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అల్లంను నిత్యం మన వాళ్లు అనేక వంటకాల్లో వేస్తుంటారు. దీన్ని మనం నిత్యం రసం రూపంలో తీసుకోవచ్చు. లేదా పొడి కూడా అందుబాటులో ఉంది. దాన్ని కూడా తీసుకోవచ్చు. నిత్యం ఉదయాన్నే పరగడుపునే అల్లం రసం తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఔషధ గుణాలు
అల్లంలో జింజరాల్ అనబడే శక్తివంతమైన బయో యాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. యాంటీ ఇన్‌ప్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కారకంగా పనిచేస్తుంది. దీని వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. వికారం తగ్గుతుంది. ఫ్లూ, జలుబు తగ్గుతాయి.
వికారం, వాంతులు
వికారం, వాంతుల సమస్యల ఉన్నవారు అల్లం రసం సేవిస్తే ఫలితం ఉంటుంది. ఉదయాన్నే పరగడుపునే 1 నుంచి 2 గ్రాముల వరకు అల్లంను అలాగే నమిలి తినవచ్చు. లేదా 2 టీస్పూన్ల వరకు అల్లం రసం తాగవచ్చు. దీంతో వికారం, వాంతులు అవడం తగ్గుతాయి. అయితే గర్భంతో ఉన్నవారు వైద్యుల సూచన మేరకు అల్లం రసం తీసుకోవడం మంచిది.
అధిక బరువు
అల్లం రసం లేదా పొడిని నిత్యం తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. 2016లో 80 మంది మహిళలపై సైంటిస్టులు ప్రయోగం చేశారు. వారికి 12 వారాల పాటు రోజుకు 2 గ్రాముల వరకు అల్లం పొడి ఇచ్చారు. తరువాత పరిశీలించగా వారి బరువు తగ్గిందని, నడుము సైజ్ కూడా తగ్గిందని గుర్తించారు. కనుక అల్లం రసం తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
ఆస్టియో ఆర్థరైటిస్
ఈ సమస్య వచ్చిన వారికి కీళ్లు దృఢంగా మారుతాయి. దీంతో ఆ భాగంలో నొప్పి వస్తుంది. అయితే అల్లం రసం అందుకు పరిష్కారం చూపుతుంది. నిత్యం 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము వరకు అల్లం పొడిని 3 నుంచి 12 వారాల పాటు తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య తగ్గిందని, చాలా మందిలో నొప్పులు తగ్గాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక అల్లం ఆస్టియో ఆర్థరైటిస్‌కు చక్కగా పనిచేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజుకు 2 గ్రాముల వరకు అల్లం పొడిని తీసుకుంటే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు 12 శాతం వరకు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల అల్లంను తీసుకుంటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
అజీర్ణం
పరగడుపునే అల్లం రసం తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్ణం తగ్గుతుంది. మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. సైంటిస్టులు ఈ విషయాలను ధ్రువీకరించారు కూడా.
రుతు సమయంలో నొప్పి
రుతు సమయంలో మహిళలు 3 రోజుల పాటు రోజుకు 2 గ్రాముల చొప్పున అల్లం పొడిని తీసుకుంటే వారికి ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలా వరకు తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్లే ఇది సాధ్యమవుతుందని వారు తెలిపారు.
కొలెస్ట్రాల్
అల్లం రసం లేదా పొడిని తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. 2018లో ఈ మేరకు సైంటిస్టులు ఓ అధ్యయనం చేపట్టారు. అందులో 60 మందికి కొలెస్ట్రాల్ అధికంగా ఉండగా వారికి నిత్యం 5 గ్రాముల మేర అల్లం పొడిని ఇచ్చారు. 3 నెలలపాటు అలా ఇచ్చి చూడగా వారిలో చెడు కొలెస్ట్రాల్ 17.4 శాతం మేర తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల అల్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.
క్యాన్సర్
అల్లంలో ఉండే జింజరాల్ అనబడే సమ్మేళనం యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల క్లోమం, కాలేయం, వక్షోజాలు, అండాశయాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
మెదడు ఆరోగ్యం
అల్లం రసం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు వంటి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్లు
అల్లంలో ఉండే జింజరాల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. శరీరంలో బాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.