సాధారణంగా ఆవులు లేదా గేదెలు ప్రసవించినప్పుడు జున్ను పాలు వస్తుంటాయి. జున్ను పాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆ పాలలో చక్కెర లేదా బెల్లం కలిపి ఉడికించి తయారు చేస్తారు. దీంతో జున్ను ఏర్పడుతుంది. అయితే జున్ను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పశువులు ప్రసవించినప్పుడు వచ్చే పాలు కనుక వాటిల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అత్యంత సహజసిద్ధమైన జున్ను పాలు. కనుక వాటిని తాగడం వల్ల అనేక పోషకాలను పొందవచ్చు. సాధారణంగా మనం తాగే పాల కన్నా జున్ను పాలలో పోషకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందువల్ల వాటితో పోషణ, శక్తి లభిస్తాయి. అత్యంత ఆరోగ్యకరమైనవి కనుక మనం ఆరోగ్యంగా ఉంటాం.
2. మన శరీరంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు మంచి బాక్టీరియా దోహదం చేస్తుంది. అయితే జున్ను పాలలో ఆ బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ పాలను తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
3. జున్ను పాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
4. జున్ను పాలలో సాధారణ పాల కన్నా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎముకలు దృఢంగా, బలంగా మారుతాయి.
5. జున్నులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కనుక చక్కెర వద్దనుకునేవారు తేనె కలుపుకోవచ్చు. అలాగే కొద్దిగా మిరియాల పొడి, యాలకుల పొడి కలుపుకుని జున్ను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.