పాలలో కాల్షియంతోపాటు మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. అయితే పాలను కొందరు తాగేందుకు ఇష్టపడరు. కొందరికి పాలను తాగితే అలర్జీలు వస్తాయి. అందువల్ల వారు పాలను ఉపయోగించి తయారు చేసే ఏ పదార్థాలను, పానీయాలను తాగరు. అయితే సాధారణ పాలకు బదులుగా పలు భిన్న రకాల పదార్థాలతో తయారు చేసిన పాలు అందుబాటులోకి వచ్చాయి. సోయా, బాదం, ఓట్స్, జీడిపప్పు వంటి పదార్థాలతో పాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలుగడ్డలతో తయారు చేసిన పాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
స్వీడన్‌కు చెందిన వెజ్ ఆఫ్ లుండ్ కొత్తగా డీయూజీ అనే బ్రాండ్ పాలను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ పేరిట ఆలుగడ్డలతో తయారు చేసిన పాలను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే సాధారణ పాల కన్నా ఆలుగడ్డలతో తయారు చేసిన పాలకు తక్కువ వనరులు అవసరం అవుతాయి. ఎక్కువ పాలు వస్తాయి.
పాలను తాగలేని వారు, పాలు అటే అలర్జీ ఉన్నవారు ఆలుగడ్డలతో తయారు చేసిన పాలను తాగవచ్చు. ఈ పాలలో గ్లూటెన్ ఉండదు. పాలకు ప్రత్యామ్నాయంగా ఈ పాలను ఉపయోగించవచ్చు. అమెరికా, యూరప్‌లలో ఇప్పటికే ఈ పాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
బంగాళాదుంపలతో తయారు చేసిన పాలలో విటమిన్ డి, బి12లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పాలలో సాధారణ పాల కన్నా కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సాధారణ పాలతో పోలిస్తే బంగాళాదుంపలతో చేసిన పాలు పూర్తిగా ఆరోగ్యకరమైనవని చెప్పవచ్చు.
అయితే బంగాళాదుంపల పాలను ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే ?
3 కప్పుల నీళ్లను తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, 1 ఆలుగడ్డ వేసి ఉడకబెట్టాలి. తరువాత ఆలుగడ్డ పొట్టు తీయాలి. ఒక టేబుల్ స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్, ఒక కప్పు బాదం పప్పు (నానబెట్టి పొట్టు తీసినవి), 2 టేబుల్ స్పూన్ల తేనె, నీళ్లు, పొట్టు తీసిన ఆలుగడ్డ.. అన్నింటినీ కలిపి బ్లెండ్ చేయాలి. దీంతో స్మూత్ ప్యూరీలా తయారవుతుంది. తరువాత ముస్లిన్ క్లాత్‌తో పిండుతూ పాలను తీయాలి. ఇలా ఆలుగడ్డ పాలను తయారు చేసుకోవచ్చు. ఈ పాలను సాధారణ పాలలా తాగవచ్చు. సిరియల్స్‌తో తినవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లోనూ తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.