Sweet Corn : మనకు రహదారుల పక్కన బండ్లపై స్వీట్ కార్న్ ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంటుంది. సాధారణంగా లోకల్ మొక్కజొన్న అయితే కేవలం సీజన్‌లోనే వస్తుంది. కానీ స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. దీంతో చాలా మంది అనేక రకాల వంటలు చేస్తుంటారు. ఇక అనేక మంది స్వీట్‌కార్న్‌ను ఉడకబెట్టి తింటుంటారు. స్వీట్‌కార్న్‌ను ఉడికించి వాటిపై ఉప్పు, కారం, నెయ్యి వంటివి చల్లి తింటే వచ్చే మజాయే వేరు. ఆ రుచే వేరేగా ఉంటుంది. అయితే వాస్తవానికి స్వీట్ కార్న్ అంటే కేవలం ఒక చిరుతిండిగా చాలా మంది భావిస్తారు. కానీ స్వీట్ కార్న్‌తో మనకు చెప్పలేనన్ని లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్‌కార్న్‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. దీన్నే విటమిన్ బి9 అంటారు. ఇది మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలకు ఎంతగానో మేలు చేస్తుంది. వారిలో ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతుంది. గర్భస్థ శిశువుకు ఈ కణాలు ఎంతగానో అవసరం. ఇక కడుపులో ఉన్న శిశువు ఎదుగుదలకు కూడా ఫోలేట్ ఉపయోగపడుతుంది. కనుక గర్భిణీలు స్వీట్‌కార్న్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒక మీడయం సైజ్ స్వీట్‌కార్న్‌లో సుమారుగా 42 మైక్రోగ్రాముల వరకు ఫోలేట్ లభిస్తుంది.
స్వీట్‌కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సాల్యుబుల్, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఇందులో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. ముఖ్యంగా ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. సాల్యుబుల్ ఫైబర్ ప్రీబయోటిక్‌గా ఉపయోగపడుతుంది. దీంతో మన జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు జరుగుతుంది. స్వీట్ కార్న్‌లో విటమిన్లు బి1(థయామిన్), బి3 (నియాసిన్), విటమిన్ ఎ ఉంటాయి. ఇవి మెటబాలిజం, చర్మ ఆరోగ్యం, ఇమ్యూనిటీ వంటి వాటికి అవసరం. నియాసిన్ వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారి ఆరోగ్యంగా ఉంటుంది.
స్వీట్ కార్న్‌లో లుటీన్, జియాజాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే కంటి చూపును మెరుగు పరుస్తాయి. స్వీట్ కార్న్‌లో ఉండే పొటాషియం రక్తసరఫరాను మెరుగు పరిచి హైబీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా స్వీట్ కార్న్‌తో మనకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వీటిని విడిచిపెట్టకుండా తినండి.