పాలు, పసుపు.. మన శరీరానికి రెండూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతారు. ఎందుకంటే దీంట్లో మన శరీరానికి ఉపయోగపడే దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఇక పసుపును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వాడుతూ వస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మనల్ని రోగాల బారిన పడకుండా చూస్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగితే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాలలో పసుపును కలుపుకుని తాగడం వల్ల ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నిషియం, కర్‌క్యుమిన్, కాల్షియం, పొటాషియం తదితర అనేక పోషకాలు అందుతాయి. దీని వల్ల సీజనల్ జలుబు, వాపులు, ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దగ్గు, ఫ్లూ జ్వరం తగ్గుతాయి.
2. పాలలో పసుపును కలుపుకుని రోజూ తాగితే దంత సమస్యలు ఉండవు. గుండె సరిగ్గా కొట్టుకుంటుంది. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. ఆస్టియోపోరోసిస్, పెద్ద పేగు క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి.
3. మలబద్దకం సమస్య చాలా మందిని ఈ సీజన్‌లో బాధిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు పాలలో పసుపు కలుపుకుని రాత్రి పూట తాగితే మంచిది. దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
4. నిద్రలేమి సమస్య ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని రోజూ తాగవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
5. అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ మిశ్రమాన్ని రోజూ తాగవచ్చు. దీని వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365