Health Tips : మనం ఆహారం తినే ముందు మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. ఇలా తెలిసీ తెలియక చేసిన పొరపాట్ల వల్ల తీవ్రమైన జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా జీర్ణక్రియ సమస్యలు మొదలవడంతో ఇతర సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే మనం భోజనానికి ముందు, తర్వాత ఏ విధమైన తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. చాలామంది భోజనానికి ముందు, భోజనం తర్వాత చేసే అతి పెద్ద పొరపాటు నీటిని గబగబా తాగడం. ఇలా నీటిని ఎక్కువగా తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. అందుకే భోజనానికి కొంత సమయం ముందు, భోజనం తరువాత కొంత సేపు ఆగి నీళ్లు తాగాలి. కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
2. చాలా మంది తిన్న వెంటనే వాకింగ్ చేస్తుంటారు. ఇకపై పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. తిన్న అరగంట తర్వాతే వాకింగ్ చేయాలి. తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. కొంత సమయం ఇచ్చిన తరువాత వాకింగ్ చేయడం వల్ల మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
3. చాలా మంది రాత్రి లేటుగా భోజనం చేసి.. భోజనం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఇలా చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక.. రాత్రి నిద్ర లేక సతమతమవుతుంటారు. కనుక పడుకోవడానికి, రాత్రి భోజనానికి మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనం అనంతరం 3 గంటల తరువాతే నిద్రించాలి. దీంతో ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అధిక బరువు పెరగకుండా ఉంటారు.
4. చాలామంది భోజనం చేయగానే వెంటనే టీ తాగుతారు. ఇలా టీ తాగడం వల్ల తేయాకులో ఉండే రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం కానివ్వవు. దీంతో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలను తాగరాదు. కనీసం 30 నిమిషాలు అయినా ఆగాలి. ఆ తరువాత టీ, కాఫీలను తీసుకోవచ్చు.