Health Tips For Fever : వర్షాకాలంలో మనకు సహజంగానే పలు రకాల విష జ్వరాలు వస్తుంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలా వస్తాయి. ఇక కొందరికి అన్‌సీజన్‌లోనూ పలు రకాల కారణాల వల్ల జ్వరం వస్తుంటుంది. అయితే కారణాలు ఏమున్నప్పటికీ జ్వరం వచ్చిందంటే కనీసం 5 నుంచి 7 రోజుల పాటు విశ్రాంతి కావాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. డాక్టర్లు ఇచ్చే మందులను వాడాలి. దీంతో జ్వరం తగ్గుతుంది. అయితే జ్వరం వచ్చిన వారు పాటించాల్సిన చిట్కాలు మరికొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగినా, స్నానం వల్ల క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చి సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీంతో జ్వరం తగ్గుతుంది. ఉన్నితో చేసిన షూ సాక్సులను చల్లని నీటిలో తడిపి బాగా పిండాలి. అనంతరం వాటిని కాళ్లకు వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకోవాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ సాధారణ స్థితికి చేరుకుంటుంది. జ్వరం ఇలా వేగంగా తగ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే టిప్. చిన్నారులకు ఇలా చేయడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి జ్వరం వెంటనే తగ్గుముఖం పడుతుంది. దీని వల్ల జ్వరమే కాదు ఛాతిలో ఉన్న కఫం కూడా పోతుంది.
చిన్నపాటి నాప్‌కిన్ టవల్స్‌ను తీసుకుని చల్లని నీటిలో తడిపి వాటిని నుదుటిపై లేదా మెడ, కాలి మడమలపై వేయాలి. ఇలా చేయడం వల్ల జ్వరం తగ్గుతుంది. టవల్స్ పూర్తిగా ఆరిపోయినా కూడా మళ్లీ, మళ్లీ ఇలాగే చేస్తుంటే జ్వరం వెంటనే తగ్గుముఖం పడుతుంది. జ్వరం వచ్చిన వారు సాధారణంగా తినే తిండి కంటే కొద్దిగా తక్కువ తింటే బెటర్. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు శరీరం కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో బాగా తింటే ఆ తిన్నదాన్నంతా జీర్ణం చేసేందుకే శరీరం కష్టపడుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు కావల్సిన శక్తి శరీరానికి ఉండదు.
జ్వరం వచ్చిన వారు ఎక్కువగా పండ్లను తీసుకోవాలి. ప్రధానంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, ద్రాక్ష, కివీ వంటి పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు. ఈ పండ్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నూనె ఎక్కువగా ఉండే ఆహారం, జీర్ణం అయ్యేందుకు సమయం పట్టే ఆహారాన్ని తినకపోవడమే ఉత్తమం. కూరగాయలు, చికెన్ కలిపి వండే చికెన్ సూప్‌ను తాగితే శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు తగిన శక్తి వస్తుంది. చికెన్ సూప్‌ను తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి.
తీపి పదార్థాలను తక్కువగా తినాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీంతో శరీరానికి తగిన ద్రవాలు అందుతాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. తులసి ఆకులు, పుదీనా ఆకులు, అల్లం వంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ టీని పాలు, చక్కెర లేకుండా తాగాలి. దీంతో ఆయా పదార్థాల్లో ఉండే ఔషధ గుణాలు ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు సహకరిస్తాయి. ఆకలి సరిగ్గా లేకపోవడం, మజ్జుగా ఉండడం, శరీరంపై దురదలు రావడం, ఫిట్స్ రావడం, గొంతు నొప్పి, మంట, తలనొప్పి, చెవి నొప్పి, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలు తరచూ వస్తుంటే లోలోపల జ్వరం ఉందని తెలుసుకోవాలి. దీనికి స్పందించి తగిన చికిత్స తీసుకోవాలి.