Health Tips : రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోషకాలు, శక్తిని శరీరం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచే గ్రహిస్తుంది. కనుకనే ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్యవంతమైంది అయి ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉదయం ఎక్కువ మొత్తంలో ఆహారాలను తీసుకోవాలని చెబుతుంటారు. అన్ని పోషకాలు కలిగిన చాలా బలవర్ధకమైన ఆహారాన్ని ఉదయమే తీసుకోవాలి. దీంతో ఎక్కువ మొత్తంలో పోషకాలు, శక్తి మనకు లభిస్తాయి. ఇవి మనల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. ఎంత పనిచేసినా అలసట అనేది రాదు. ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు. కనుక ఉదయం మనం తినే ఆహారానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. రోజూ చేసే టిఫిన్‌తోపాటు కింద తెలిపిన ఆహారాలను కూడా తీసుకుంటే శరీరానికి శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తోపాటు తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..
1. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేశాక ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను తినాలి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం రాకుండా చూస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కనుక బ్రేక్ ఫాస్ట్‌తోపాటు బొప్పాయి పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి.
2. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తోపాటు పుచ్చకాయ ముక్కలను కూడా తినవచ్చు. ఇవి శరీరానికి కావల్సిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. వేసవితాపం తగ్గుతుంది. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. పుచ్చకాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విటమిన్ బి6, లైకోపీన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
3. రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదంపప్పును ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకోవాలి. ఇవి శరీరానికి అత్యంత శక్తిని అందజేస్తాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. 10 బాదం పప్పులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటి పొట్టు తీసి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
4. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత జీలకర్ర నీళ్లు లేదా వాము నీళ్లను కూడా తాగవచ్చు. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి శరీరానికి శక్తిని అందజేస్తాయి. ఈ క్రమంలోనే రోజంతా మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అధిక బరువు సులభంగా తగ్గుతారు.
5. ఉదయం టిఫిన్ చేసిన తరువాత పండ్లు లేదా కూరగాయల రసాలను తాగవచ్చు. క్యారెట్, బీట్‌రూట్, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్‌లను తాగినా ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.