మహిళలు తమ జీవితంలో అనేక దశల్లో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. టీనేజ్‌లో, యుక్త వయస్సులో, పెళ్లి అయ్యి తల్లి అయ్యాక, తరువాతి కాలంలో, మెనోపాజ్ దశలో అనేక సమస్యలను వారు అనుభవిస్తుంటారు. ఒక్కో దశలో అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తుంటాయి. అయితే ఏ దశలో అయినా సరే అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. అందుకు సమతుల ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. అందులో తగిన పోషకాలు కూడా ఉండాలి.
మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తాము నిత్యం తీసుకునే ఆహారంలో ఈ పోషకాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ పోషకాలు ఏమిటంటే..
ఐరన్…
మహిళలకు రుతు క్రమం కారణంగా తీవ్రమైన రక్తస్రావం అవుతుంటుంది. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. దీన్ని నివారించాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. చికెన్, నట్స్, సీఫుడ్, బీన్స్, పాలకూర, చీజ్ వంటి ఆహారాలను తింటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
కాల్షియం…
ఎముకలు దృఢంగా ఉండడంతోపాటు గుండె ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కాల్షియం లోపిస్తే గుండె జబ్బులు వస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకు గాను నిత్యం కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలు, బెండకాయలు, పాలకూర, చీజ్, సార్డిన్ చేపలను తింటే కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
బి విటమిన్లు…
మహిళలకు బి విటమిన్లు ఎంతగానో అవసరం. ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు ఈ విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ప్రధానంగా ఫోలేట్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినాలి. దీంతో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. అలాగే గర్భంలో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. కోడిగుడ్లు, ట్యూనా ఫిష్, చీజ్, చికెన్, సాల్మన్ చేపలు, పాలు, ఆల్చిప్పలలో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
మెగ్నిషియం…
గర్భంతో ఉన్న మహిళలు మెగ్నిషియం ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. మెగ్నిషియం వల్ల నాడులు, కండరాల పనితీరు మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అవకాడోలు, పాలకూర, నట్స్, గుమ్మడి కాయ విత్తనాలు, డార్క్ చాకొలెట్లలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది.
కోలిన్…
కణాల నిర్మాణానికి కోలిన్ ఎంతగానో మేలు చేస్తుంది. ఇది కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మనస్సు ప్రశాంతంగా మారేలా చేస్తుంది. బ్రొకొలి, కోడిగుడ్ల, కాలిఫ్లవర్, సాల్మన్ చేపలు, సోయాబీన్ ఆయిల్‌లలో కోలిన్ సమృద్ధిగా మనకు లభిస్తుంది. మహిళలు ఈ పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.