గుండెపోటుతో ఆరోగ్యం దిగజారింది. అయితే, మరోమారు ఆరోగ్యం పూర్తిగా పొంది జీవితాన్ని ఆనందించాలంటే ఏం చేయాలనేది పరిశీలించండి. గుండె చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమించే కండరం. దీనికి ఇతర కండరాల వలె ఆక్సిజన్ అధికంగా వుండే రక్తం కావాలి. ఏ కారణంచేత అయినా రక్త సరఫరా ఆగినా గుండెపోటు వస్తుంది. కారణాలు అనారోగ్య ఆహారం మొదలు అధిక స్మోకింగ్ లేదా లిక్కర్ కూడా కావచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చినా, జీవన విధానం సరిచేసుకుంటే ఆనందంగా మరోమారు గడపవచ్చంటున్నారు గుండెనిపుణులు.
జీవన విధానంలో వ్యాయామం, తాజా సహజ ఆహారాలు చేర్చి ఆరోగ్య నియమాలు పాటిస్తే రెండవసారి గుండెపోటు కూడా రాదని తెలియజేస్తున్నారు. ఆహారంలో మార్పులు – చెడు కొల్లెస్టరాల్ లేని ఆహారం తినాలి. కొవ్వు తక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ గల ఆహారాలు తినాలి. వ్యాయామం – గుండెపోటు నుండి కోలుకోటానికి కనీసం అయిదు లేదా ఆరు వారాలు పడుతుంది. పోటు తర్వాత మీ కదలికలు మెల్లగా పెంచాలి. నడక, గార్డెనింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, సైకిలింగ్ వంటివి శ్వాస వ్యవస్ధను మెరుగుపరుస్తాయి.
గుండెకు చేరే రక్తంలో ఆక్సిజన్ అధికమవుతుంది. ప్రతిరోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. ఒత్తిడి అధికమవటం, కోపం అధికం కావటం రెండవ హార్ట్ ఎటాక్ తెప్పిస్తాయి. డైరీ వ్రాయండి – ఒత్తిడి కలిగించే సంఘటనలు వ్రాయండి. అవి మరల రిపీట్ కాకుండా చూసుకోండి. ట్రాఫిక్ జామ్ వంటివి కోపాన్ని కలిగిస్తే, ఆ సమయంలో చక్కటి మ్యూజిక్ విని రిలీఫ్ పొందండి. పాజిటివ్ గా వ్యవహరించండి. రిలాక్స్ అవండి, యోగా లేదా మసాజ్ ధిరపీ వంటివి ఆచరించండి. ప్రతిరోజూ హాయిగా అవసరమైన ఎనిమిదిగంటల నిద్ర తప్పనిసరిగా పొందాలి.