భారతదేశంలో గుండె జబ్బులు అధికంగా వున్నాయని అవి పట్టణ వాసులలో 6.6 శాతం నుండి 12.7 శాతంగాను గ్రామీణ ప్రాంతాలలో 2.1 శాతం నుండి 4.3 శాతంగాను వున్నాయని ఈ గణాంకాలు 20 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సేకరించబడ్డాయని తాజాగా చేయబడిన ఒక సర్వే తెలిపింది. భారతదేశంలో ప్రస్తుతం 30 మిలియన్ల మంది గుండె జబ్బుల రోగులున్నారు. పట్టణాలలో ప్రతి లక్షకు 334 నుండి 424 గుండెపోటు కేసులు, గ్రామీణ ప్రాంతాలలో 244 నుండి 262 కేసులు నమోదవుతున్నాయని ఇవి ప్రతి సంవత్సరం పెరుగుదల చూపుతున్నాయని నివేదిక చెపుతోంది.
అధిక రక్తపోటు వున్న రోగుల సంఖ్య 2000 సంవత్సరంలో 118 మిలియన్లు వుండగా, అది 2025 నాటికి 213 మిలియన్లుగా వుండగలదని అంచనా వేశారు. అంతేకాక, భారతదేశం ప్రపంచ షుగర్ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా వుండగలదని ఇప్పటికే 51 మిలియన్ ప్రజలు ఈ వ్యాధిబారిన పడ్డారని, అదేవిధంగా ప్రతి సంవత్సరం 8 లక్షలమంది కేన్సర్ రోగులు కూడా నమోదవుతున్నారని నివేదిక తెలిపింది.
ఆరోగ్య జాగ్రత్తలు అధికంగా పాటించే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సైతం పోషకాహార విలువలను తమ ఆహారంలో పాటించడం లేదని పండ్లు, ఆకు కూరలు, కూరలు మొదలైన పోషక విలువల ఆహారాన్నిప్రతివ్యక్తి రోజుకు 265 గ్రాములు మాత్రమే వినియోగిస్తున్నట్లు, నిర్దేశిత పరిమాణాలకంటే ఇది చాలా తక్కువని తెలుస్తోంది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికమైందని, దేశ వ్యాప్తంగా ఆరోగ్య పదార్ధాలైన పండ్లవంటి వాటికి ఒక జాతీయ విధానం వుండాలని కూడా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో కోరింది.