High Blood Pressure : హై బ్లడ్ ప్రెషర్.. దీన్నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. హైబీపీ ఉన్నవారు తమ రోజువారీ దినచర్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా ఉపయోగించాలి. దీంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. దీంతో హైబీపీ అదుపులో ఉంటుంది. అయితే కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బీపీ అమాంతం పెరుగుతుంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా బీపీ పెరిగిపోతుంది. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. అయితే అలా సడెన్‌గా బీపీ పెరిగితే ఏం చేయాలో.. అలాంటి వారికి పక్కన ఉన్న వారు ఎలాంటి సేవలు అందించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పక్కన ఉన్న ఎవరికైనా సడెన్‌గా బీపీ పెరిగితే మీరు ఆందోళ చెందకుండా వారిని ముందుగా ప్రశాంతంగా ఒక చోట కూర్చోబెట్టండి. చుట్టూ ఏవైనా పెద్ద శబ్దాలు వస్తున్నా, పెద్ద ఎత్తున మ్యూజిక్ వింటున్నా వెంటనే ఆపేయండి. ఇక పేషెంట్‌ని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలమని చెప్పండి. దీంతో బీపీ కొంత వరకు తగ్గుతుంది. దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుని వదలమని చెబితే వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది. అలాగే బీపీ సడెన్‌గా పెరిగిన వారికి వెంటనే నీళ్లను తాగేందుకు ఇవ్వాలి. నీళ్లను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
బీపీ సడెన్‌గా పెరిగితే కొందరికి విపరీతమైన తలనొప్పి, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటివి వస్తాయి. అలా గనుక వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పేషెంట్‌ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి. అది కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. ఇక సడెన్‌గా బీపీ పెరిగితే పొటాషియం ఉండే పలు రకాల పండ్లను తినాలి. పొటాషియం శరీరంలో ఉండే సోడియం లెవల్స్‌ను అదుపు చేస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది.
ఇక మనకు పొటాషియం అదికంగా ఉన్న పండ్లలో అరటి పండ్లు, కివి, యాపిల్స్, నిమ్మ వంటివి ముఖ్యమైనవి. బీపీ సడెన్‌గా పెరిగితే వెంటనే ఒక అరటి పండు లేదా కివి లేదా యాపిల్ తినవచ్చు. లేదా నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగవచ్చు. దీంతో బీపీ వెంటనే అదుపులోకి వచ్చేస్తుంది. బీపీ సడెన్‌గా పెరిగితే వెంటనే అలాంటి వారి ముఖంపై కొన్ని నీళ్లు చల్లాలి. ఇది వారికి మూర్ఛ రాకుండా చేస్తుంది. అలాగే వారికి తాజా గాలి అందేలా చూడాలి. దీంతోపాటు బీపీ వచ్చిన వారు ఒత్తిడి, ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలి. చాలా నెమ్మదిగా సుదీర్ఘమైన శ్వాస తీసుకోవాలి.
పొటాషియం ఉన్న వాటిని తినాలి..
బీపీ ఎక్కువగా ఉన్నవారు రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. కనీసం తేలికపాటి వాకింగ్‌ను 30 నిమిషాల పాటు చేసినా చాలు, దీంతో బీపీ తగ్గుతుంది. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. దీంతో బీపీ చాలా వరకు అదుపులోకి వస్తుంది. అలాగే నీళ్లను తగిన మోతాదులో తాగడం, వేళకు భోజనం చేయడం, సరిగ్గా నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, ఉప్పు తగ్గించడం వంటి సూచనలు పాటిస్తే హైబీపీని చాలా ఈజీగా అదుపు చేయవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు ముప్పు తప్పుతుంది.