High BP : ప్రస్తుత తరుణంలో హైబీపీ సమస్య అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒక వయస్సు తరువాత బీపీ పెరగడం అనేది సహజంగానే చాలా మందిలో కనిపిస్తోంది. ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల యువతలో కూడా హైబీపీ సమస్య వస్తోంది. అయితే ఇతర కాలాలలో కంటే చలికాలంలోనే బీపీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా మన శరీరానికి కావల్సినంత వేడి కూడా లభించదు. దీంతో బీపీ ఎక్కువవుతుంది. అయితే బీపీ లేని వారికి ఇబ్బంది ఉండదు. కానీ హైబీపీ ఉన్నవారికి సమస్య మరింత ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక బీపీ ఉన్నవారు చలికాలంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
హైబీపీ సమస్య ఉన్నవారిలో విపరీతమైన అలసట, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మతిమరుపు సమస్య వస్తుంది. చెప్పిన విషయాలను సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. అలాగే కొందరికి ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. దీంతోపాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల హైబీపీని తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. ప్రస్తుతం మనకు మార్కెట్‌లో అనేక రకాల బీపీ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక మెషిన్‌ను కొనుగోలు చేసి రోజూ బీపీని చెక్ చేసుకోవాలి. దీనివల్ల బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది బీపీని కంట్రోల్ చేసేందుకు సహాయ పడుతుంది.
2. రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా సరే చేయాలి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.
3. చల్లని ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండవద్దు. అలా అని చెప్పి ఎండలోనూ మరీ ఎక్కువ సేపు ఉండవద్దు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకే రకంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో రక్త సరఫరా సక్రమంగా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.
4. కూరగాయలు, పండ్లను అధికంగా తీసుకోవాలి. వాటిల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అలాగే కొవ్వు తీసిన పాలు తాగాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, చేపలు, గుడ్లు, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే బీపీ అదుపులోకి వస్తుంది.
5. హైబీపీని తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు తులసి ఆకులను కోసి నేరుగా అలాగే నమిలి మింగాలి. లేదా 1 టీస్పూన్ మోతాదులో తులసి ఆకుల రసం తాగాలి. దీంతో బీపీ తగ్గుతుంది.
6. తులసి ఆకుల్లాగే కరివేపాకులు కూడా బీపీకి బాగానే పనిచేస్తాయి. వీటిని రోజూ ఉదయం పరగడుపునే 10 ఆకుల చొప్పున తింటుండాలి. హైబీపీ తగ్గుతుంది.
7. వేపాకులు కూడా బీపీని తగ్గించడంలో ఉపయోగపడతాయి. వేపాకుల రసం 1 టీస్పూన్ మోతాదులో ఉదయం పరగడుపునే సేవించాలి. లేదా నాలుగైదు వేపాకులను అలాగే నమిలి మింగుతుంటే బీపీ అదుపులోకి వస్తుంది.