ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం విదితమే. తేనెను ఎన్నో ఔషధ ప్రయోగాల్లో ఉపయోగిస్తుంటారు. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. అయితే తేనె తియ్యగా ఉంటుంది కనుక దాన్ని తినేందుకు కొందరు సంశయిస్తుంటారు. కానీ తేనె చాలా సహజసిద్ధమైంది. కనుక ఎవరైనా సరే దాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు సైతం తేనెను రోజూ పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. తేనెలో ఉండేది కృత్రిమ చక్కెర కాదు, సహజసిద్ధమైన చక్కెర. కనుక అది త్వరగా రక్తంలో కలవదు. దీంతో షుగర్ లెవల్స్ పెరగవు. ఇక తేనెలో చక్కెర ఎంత పరిమాణంలో ఉంటుంది ? రోజుకు ఎవరైనా సరే ఎన్ని టీస్పూన్ల తేనెను తినవచ్చు ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. దాన్నే తేనెగా నిల్వ చేస్తాయి. చాలా పురాతన కాలం నుండి భారతీయులు తేనెని ఆహార పదార్థాలల్లో, పలు రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తున్నారు. ఇక ఒక్కో తేనెటీగ రోజుకి 10 నుండి 20 సార్లు తేనె కోసం తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక్కో తేనెటీగ సుమారుగా 50 నుంచి 100 పువ్వుల మీద వాలి తేనెను సేకరిస్తుంది. అనంతరం ఆ తేనెను తెట్టెలో నిల్వ చేస్తుంది.
ఇక 30 నుంచి 50 గ్రాముల తేనెని సేకరించడానికి ఒక్కో తేనెటీగకి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కో తేనెటీగ తేనెని సేకరించడానికి రోజుకి సుమారుగా 160 కిలోమీటర్ల దూరం మేర ప్రయాణిస్తుంది. అయితే తేనెలో 75 శాతం కన్నా ఎక్కువగా చక్కెర, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. సుక్రోస్, మాల్టోస్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు సాధారణ చక్కెరలు. ఇవి జీర్ణం అవ్వకుండా నేరుగా రక్తంలో కలుస్తాయి. కనుక మనకు శక్తి వెంటనే వస్తుంది.
వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఒక టీస్పూన్ తేనెలో 15 శాతం చక్కెర ఉంటుంది. ఒక టీస్పూన్ తేనె మనకు 64 క్యాలరీల శక్తినిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి రోజుకి 20 నుండి 30 గ్రాముల చక్కెరను తీసుకోవచ్చు. ఈ లెక్కల ప్రకారం మనం రోజుకి 1 లేదా 2 టీస్పూన్‌ల తేనెని నేరుగా లేదా ఇతర ఆహార పదార్థాలలో భాగంగా చేసుకుని తినవచ్చు.
తేనెలో యాంటీసెప్టిక్ గుణాలతోపాటు విటమిన్ బి1, బి6 సమృద్దిగా ఉంటాయి. రోజూ 1 లేదా 2 టీస్పూన్‌ల తేనె తీసుకోవడం ద్వారా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. తేనె అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై మృతకణాలను తొలగించడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా రోజూ తేనెను ఎవరైనా సరే పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.