Egg : మన శరీరానికి కావల్సిన పోషకాలను తక్కువ ధరలో అందించే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. రోజుకో గుడ్డు తినడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకో గుడ్డు తినమని చెప్పే ప్రచారాలను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డును చాలా మంది ఏదో ఒక రూపంలో తింటూ ఉంటారు. కొందరు ఉడికించుకుని తింటే మరికొందరు ఆమ్లెట్ గా, కూరగా ఇలా ఏదో ఒక విధంగా తీసుకుంటారు. గుడ్డులోని పోషకాలను, గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందలాంటే మనం గుడ్డును ఉడికించుకుని మాత్రమే తినాలి.
గుడ్డు ఉడకించుకుని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇలా తినడం వల్ల గుడ్డులోని పోషకాలు అధికంగా మన శరీరానికి లభిస్తాయి. అయితే ఈ గుడ్డును ఎంత సేపు ఉడికించుకుని తినాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డును మరీ ఎక్కువ సేపు ఉడికించకూడదు. దీనిని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించాలి. ఇది కూడా మనం ఉంచే మంటపై ఆధారపడి ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన ఉడికేందుకు దాదాపు 82 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అదే పచ్చసొన ఉడకడానికి 76 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది.
గుడ్డును ఉడికించే కొద్ది దానిలో మార్పు వస్తూ ఉంటుంది. గుడ్డు ఉడికించడం మొదలు పెట్టిన ఒకటి నుండి మూడు నిమిషాల వరకు అది ఇంకా పచ్చిగానే ఉంటుంది. కానీ పచ్చసొన విడిపోయి ద్రవంగా మారుతుంది. తెల్ల సొన మాత్రం అలాగే జిగురుగా ఉంటుంది. 3 నుండి 7 నిమిషాల్లో గుడ్డు పచ్చసొన గట్టిగా మారుతుంది. కానీ తెల్లసొన ఇంకా ద్రవంగానే ఉంటుంది. 7 నుండి 11 నిమిషాల్లో పచ్చసొన బాగా ఉడుకుతుంది. తెల్లసొన గట్టిగా మారుతుంది. జిడ్డుగా కూడా ఉంటుంది.
11 నుండి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల మరియు పచ్చసొనలు రెండు గట్టిగా మారుతాయి. ఒక గుడ్డును పూర్తిగా ఉడికించడానికి 13 నిమిషాల సమయం పడుతుంది. ఉడికించిన గుడ్డు తినాలనుకునే వారు దానిని కనీసం 13 నిమిషాల పాటు ఉడికించి తినాలి. ఈ విధంగా గుడ్డును ఉడికించి తినడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.