How To Increase Platelets : సహజంగానే మనకు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబుతోపాటు జ్వరం కూడా వస్తుంది. అయితే ఇది దోమలు వృద్ధి చెందే సీజన్. కనుక డెంగ్యూ కూడా ఎక్కువగానే వస్తుంది. డెంగ్యూ వస్తే 3 లేదా 4 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. దీంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగ్యూ వచ్చిన వారు కచ్చితంగా ప్లేట్‌లెట్లను పెంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇక ప్లేట్‌లెట్లను సహజసిద్ధంగా ఎలా పెంచుకోవచ్చు, అందుకు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డెంగ్యూ పేషెంట్లకు బొప్పాయి ఆకులను వరంగా చెప్పవచ్చు. ఈ ఆకుల్లో పపైన్, కైమో పపైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని పెంచుతాయి. కనుక డెంగ్యూ వచ్చిన వారు రోజూ బొప్పాయి ఆకుల రసాన్ని తాగుతుండాలి. దీన్ని రోజుకు పావు టీస్పూన్‌కు మించి తాగకూడదు. లేదంటే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కనుక ఈ రసాన్ని రోజూ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో మనకు దానిమ్మ పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి.
దానిమ్మ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో ప్లేట్‌లెట్ల ఉత్పత్తి పెరుగుతుంది. కనుక డెంగ్యూ పేషెంట్లు రోజూ దానిమ్మ పండ్లను తినాల్సి ఉంటుంది. పండ్లను తినలేకపోతే రోజుకు 2 పూటలా ఒక్క గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ తాగవచ్చు. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో మనకు గుమ్మడికాయ కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
పాలకూరలో ఐరన్, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్లేట్ లెట్లను పెంచడంలో సహాయపడతాయి. కనుక పాలకూర జ్యూస్‌ను కూడా రోజూ తాగవచ్చు. అయితే కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు ఈ జ్యూస్ తాగకూడదు. ఇక కొబ్బరినీళ్లలో సహజసిద్ధంగా మనకు ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ లభిస్తాయి. కనుక రోజూ కొబ్బరి నీళ్లను తాగుతున్నా కూడా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. దీంతోపాటు కలబంద గుజ్జు కూడా ప్లేట్‌లెట్లను ఉత్పత్తి చేయడంలో సహాయ పడుతుంది. అలాగే రోజూ నీళ్లను ఎక్కువగా తాగడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, వైద్యుల సూచన మేరకు మందులను వాడుతుంటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు. దీంతో క్రమ క్రమంగా ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరిగి ఆరోగ్యవంతులుగా మారుతారు. వ్యాధి నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.