Drinking Water : మన శరీరానికి నీరు ఎంతో అవసరం అన్న సంగతి మనకు తెలిసిందే. మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు నీటిపై ఆధారపడి పని చేస్తాయి. నీరు తక్కువగా తాగడం వల్ల కూడా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, మలబద్దకం, తలనొప్పి, శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం, చర్మం పొడి బారడం, చర్మం ముడతలు పడడం, శరీరంలో మలినాలు పేరుకుపోయి అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
కనుక మనం రోజూ తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. అయితే చాలా మంది భోజనం చేసేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. తినేటప్పుడు నీటిని తాగడం కాదని నిపుణులు చెబుతున్నారు. తినేటప్పుడు నీటిని తాగడం వల్ల జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలైన రసాయనాలు పలుచబడతాయి. దీంతో తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవ్వడం, సరిగ్గా జీర్ణమవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం భోజనం చేసేటప్పుడు అలాగే భోజనం చేసిన రెండు గంటల వరకు నీటిని తాగకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు నీటిని తాగే అవసరం రాకుండా ఉండాలంటే నీటిని ఒక క్రమ పద్దతి ప్రకారం తాగాలి.
ఉదయం పూట ఒకటిన్నర లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగుతుంది. వ్యాయామం చేసిన తరువాత మరో ఒకటిన్నర లీటర్ల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల టిఫిన్ తినేటప్పుడు అలాగే తిన్న తరువాత రెండు గంటల వరకు నీటిని తాగే అవసరం రాకుండా ఉంటుంది. టిఫిన్ చేసిన రెండు గంటల తరువాత కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని తాగకూడదు. ఇలా చేయడం వల్ల భుక్తాయాసంగా ఉంటుంది. అలాగే మనం తిన్న ఆహారం త్వరగా ప్రేగుల నుండి బయటకు నెట్టివేయబడుతుంది. ఉదయం పూట మనం ఖాళీ కడుపుతో నీటిని తాగుతున్నాం.
కనుక ఎక్కువ మొత్తంలో నీటిని తాగవచ్చు. కానీ ఆహారం తీసుకున్న తరువాత రెండు గంటల వరకు నీటిని తాగకుండా అపై అర గంట చొప్పున లేదా గంట చొప్పున అర గ్లాస్ లేదా ఒక గ్లాస్ మోతాదులో నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం తాగిన నీరు వెంటనే శరీరానికి పడుతుంది. ఇలా భోజనం చేసే వరకు తాగాలి. మరలా భోజనం చేసిన రెండు గంటల వరకు కూడా నీటిని తాగకూడదు. మరలా సాయంత్రం ఆహారం తీసుకునే వరకు ముందులాగే గంటకొకసారి నీటిని తాగుతూ ఉండాలి. ఈ విధంగా నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత నీరు చక్కగా అందుతుందని నిపుణులు చెబుతున్నారు.