Eggs : మనం ప్రోటీన్లు లేదా శక్తి కావాలంటే కోడిగుడ్లపై ఆధార పడతాం. ఎందుకంటే ఇవి మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి మరియు ధర కూడా చాలా తక్కువ కాబట్టి. అందుకనే కోడిగుడ్లను చాలా మంది తింటుంటారు. ఇవి అంటే చాలా మందికి ఇష్టమే. వీటితో అనేక రకాల వంటలను చేసి తింటుంటారు. కోడిగుడ్లలో సెలీనియం, ఫోలేట్, జింక్, క్యాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఎ, ఇ, డి, బి2, బి5, బి6 అధికంగా ఉంటాయి.
రోజూ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసేవారు తప్పనిసరిగా కోడిగుడ్లను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12 ఉంటుంది. అయితే వేసవిలో కోడిగుడ్లను తినేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
వేసవిలో కోడిగుడ్లు త్వరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో మీరు పాడైన గుడ్లను తింటే అవి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. కనుక మీరు కొనుగోలు చేసిన గుడ్లు తాజావేనా, ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచినవా.. అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు ఏం చేయాలంటే.. కోడిగుడ్లను నీళ్లలో వేయాలి. గుడ్డు నీళ్లలో తేలినట్లు కనిపిస్తే అది చాలా పాత గుడ్డు అన్నమాట. అలాంటి గుడ్లను తినకూడదు.
గుడ్లు మన శరీరానికి వేడి చేస్తాయి. అందువల్ల వేసవిలో వీటిని పరిమిత మోతాదులో తినాలి. ఇక కోడిగుడ్లలో పచ్చ భాగాన్ని తింటే ఒకటికన్నా ఎక్కువ తినకూడదు. అలా తింటే అవి జీర్ణం అయ్యేందుకు సమయం పట్టవచ్చు. దీంతో మీకు అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక రోజుకు ఒక కోడిగుడ్డుకు మించకుండా తినాలి. ఎక్కువగా తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగి వేడి చేస్తుంది. అజీర్తి, విరేచనాలు, వాంతులు అవుతున్నవారు కోడిగుడ్లను తినకూడదు.