Fish : ఎంతో కాలంగా మనం చేపలను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. చేపలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చేపలను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు చేపల్లో ఉంటాయి. సోడియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మినరల్స్ తో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి లు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చేపల్లో అధికంగా ఉంటాయి.
ఎంతో రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. చేపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు 23 శాతం వరకు తగ్గితుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చేపల వల్ల కలిగే లాభాలను పొందాలంటే వాటిని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మనం చేపలతో కూర, పులుసు, వేపుడు వంటి చేసుకుని తింటూ ఉంటాం. చేపలను వేపుడుగా చేసుకుని తినడానికి బదులుగా వాటిని కూరగా, పులుసుగా చేసుకుని తినడం వల్ల మాత్రమే మనం పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అలాగే మనం తాజా చేపలతో పాటు ఎండు చేపలు, ఉప్పు చేపలు వంటి వాటిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇలా ఎండిన చేపల్లో పోషకాలు అన్నీ ఉండవని వాటిని తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందలేమని నిపుణులు తెలియజేస్తున్నారు. అదే విధంగా అధిక నూనె ఉపయోగించి వండిన చేపలను తినడం వల్ల వాటి వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా కలుగుతుందని వారు చెబుతున్నారు. తక్కువ నూనెతో చేపలను వండడం చాలా ఉత్తమమైన పని అని వారు అంటున్నారు.
రోజూ చేపలను తినడం వల్ల మధ్య వయస్సు దాటిన పురుషులకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే అప్పుడప్పుడు మాత్రమే చేపలను తినే వారితో పోలిస్తే ఇలా రోజూ చేపలు తినే వారిలో గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం, అధిక రక్తపోటు, అధిక బరువు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు వివరిస్తున్నారు. చేపల్లో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ట్రై గ్లిజరాయిడ్ల మోతాదును కూడా తగ్గిస్తాయని వారు చెబుతున్నారు.
అలాగే చేపలతో పాటు చేప నూనె మాత్రలను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చేపలను తినడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే చేపలను తక్కువ నూనె ఉపయోగించి మాత్రమే వండుకుని తినాలని అధికంగా నూనెను ఉపయోగించి వండిన చేపలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.