పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయని ఆరోగ్యానికి వాటిని తినాలని అందరూ కోరతారు. మరి అవి కనుక కలుషితం అని భావిస్తే, మనం ఏం చేయలి? సాధారణంగా ఏ సీజన్ అయినప్పటికి ఆ కాలంలో వచ్చే తాజా, రంగురంగుల పండ్లు, కూరగాయలు చూడ ముచ్చటగా వుంటాయి. ఆరోగ్యాభిలాషులు పండ్లు తినటం అంటే ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ పండ్లు, కూరగాయలు ఎన్నో రసాయనిక ఎరువులు వేసి పురుగుమందులు చల్లి పండించటం చేసి మనకు అందిస్తే మనకు వాటివలన చేకూరే లాభం ఎంత వుంటుంది?
పండ్లను వ్యాపారస్తులు తమ వ్యాపార సౌకర్యం కొరకుగాను ముందుగానే యూరియా, ఈధేన్, కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ వేసి పచ్చివాటిని ముందస్తుగానే పండ్లుగా తయారు చేయటం వంటి చర్య కూడా ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పచ్చివాటిని పండుగా తయారు చేయటానికి గ్యాస్ వదిలే పద్దతులననుసరించి వ్యాపారస్తులు వాటి నాణ్యతలను, నిలువను వారు కోరినట్లే చేస్తున్నారు. ఈ రకంగాపండ్లను, ఎధిలిన్ గ్యాస్ తో కృత్రిమంగా పండు చేయటం వలన నరాల వ్యవస్ధపై అది ప్రభావించి కళ్ళు, చర్మం, ఊపిరితిత్తులు, చివరకు జ్ఞాపక శక్తి సైతం దెబ్బతినగలదు. కొన్ని దేశాల ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవచూపి ఈ రకమైన గ్యాస్ వినియోగ చర్యలను నిషేధించినప్పటికి, వ్యాపారస్తులు ప్రత్యామ్నాయ మార్గాలలో తమ వ్యాపారానికి అనుకూలంగా పచ్చివాటిని కొనుగోలు చేసి వారి గిడ్డంగుల నిలువకు వ్యాపారానికి అనుకూలంగా ఇతర పద్ధతులలో వాటిని పండుగా తయారు చేస్తూనే వున్నారు.
వీరి చర్యలకు తోడు రైతులు ఎన్నో పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడి పంట దిగుబడులు సాధిస్తున్నారు. కనుక ఈ పరిస్ధితులలో వినియోగదారులుగా కనీసం మనం చేయగలిగినది ఏమిటనేది పరిశీలిద్దాం. మీరు తినే పండ్లు, కూరగాయలు కొద్దిపాటి ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటితో పూర్తిగా కడగండి. పండ్లను కనీసం నీటిలో 5 నుండి 7 నిమిషాలు వుంచేలా చూడండి. తర్వాత వాటిని మంచినీటితో శుభ్రంగా కడిగి పొడిగా ఆరనిచ్చి వాటిని తినండి. పండ్లను కొనే ముందు, వాటి నాణ్యతను బాగా పరిశీలించండి. వాటికి ఏ రకమైన పౌడర్ వినియోగం లేదా ఇతర గుర్తులు వుంటే వాటిని కొనుగోలు చేయకండి.