నిజంగా ఆకలి లేకుండానే మీరు ఎన్నిసార్లు భోజనం చేసేశారు? మీరు తినే ఆహారం సౌకర్యాన్నిస్తోందా? బోర్ కొట్టేస్తున్నా, కోపంగా వున్నా, సంతోషం ఎక్కువైనా, బాధ కలిగినా బాగా తినేస్తున్నారా? అలాగయితే…మీరు ఒళ్ళు తెలీకుండా ఆవేశంలో తినేస్తున్నట్లే. అధికంగా తినేయటం వ్యక్తి యొక్క మానసిక స్ధితిని బట్టి వుంటుందని అది జీవప్రక్రియకు సంబంధం కలిగి వుంటుందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డా. నూపుర్ క్రిష్ణన్ అంటారు. యువతులకయితే, సన్నబడాలన్న మానసిక ఒత్తిడి కూడా వుంటుందట. ఈ రకంగా తినేదానిపై ధ్యాస లేకుండా తింటే అధిక కేలరీలు కల ఆహారాలు ఎక్కువ మొత్తంలో తక్కువ వ్యవధిలో తీసుకుంటారు (ఒక్కొక్కపుడు 8 వేలనుండి 10 వేల కేలరీలవరకు కూడా తినేస్తారని డా. క్రిష్ణన్ చెపుతారు.
దీని ప్రభావం ఎలా వుంటుంది? లావెక్కుతారు. ఇది శారీరక, మానసిక ఒత్తిడికి దోవతీస్తుంది. పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే పోషకాహార లేమి సంబంధిత వ్యాధులు వస్తాయి. అధిక షుగర్, పిండిపదార్ధాలు నిలబడటం వంటివి జీవప్రక్రియను మారుస్తాయి. ఫలితంగా శరీరంలో షుగర్ లెవెల్స్ మారుతూంటాయి. పురుషులకంటే కూడా మహిళలు ఈ రకమైన ఆవేశపూరిత తిండ్లు అధికంగా తింటున్నారట. దానితో లావెక్కటం, లావెక్కామన్న ఆందోళన, మానసిక వేదన, గుండె సంబంధిత వ్యాధులు కూడా తెచ్చుకుంటున్నట్లు పోషకాహార నిపుణులు చెపుతున్నారు. పరిష్కారం! ఆహారం తింటే హాయిగా వుండే భావన కలగాలి.
కాని ప్రస్తుతం తినేవారు, ఆందోళన, తప్పు చేశామన్న ఫీలింగు, ద్వేషం, మానసిక వేదన లేదంటే టీవీపై ధ్యాస మొదలైనవాటితో భుజిస్తున్నారు. అవన్ని వున్నప్పటికి వాటిని సరి చేసుకుని తినటం ప్రధానమంటున్నారు నిపుణులు. ఆకలి లేనపుడు, అప్ సెట్ అయినపుడు భాగస్వామితో మాటలు సరిగా లేనపుడు తినవద్దు. భావావేశాలతో తినేస్తే కలిగే పరిణామాలను వ్యాయామాలు, ఆహార ప్రణాళికలు కూడా సరి చేయలేవు. అధిక బరువు పొందటం, వ్యాధులు కలిగి వుండటం వాటికి ఆహార, వ్యాయామ నిపుణుల వద్దకు పరుగులు పెట్టేకంటే, చక్కని మానసిక వైద్యుడి సలహాలు పొందటం మంచిదని కూడా వీరు తెలియజేస్తున్నారు.